
కాంగ్రెస్, టీడీపీలకు షాక్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ ఎంసీ) ఎన్నికలకు ముందు టీడీపీ, కాంగ్రెస్ లకు షాక్ తగిలింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ టీడీపీ ఎమ్మెల్యే జి. సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ గురువారం టీఆరెఎస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ సమక్షంలో వీరు గులాబీ కండువా కప్పుకున్నారు.
పరిస్థితులకు అనుగుణంగా టీఆర్ఎస్ పార్టీలో చేరారని ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. జంటనగరాల్లో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులతో జీహెచ్ ఎంసీలో టీఆర్ఎస్ పుంజుకుంటుందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీలో ఉన్నప్పటికీ తనకు తగిన ప్రాధాన్యం దక్కలేదని వాపోయారు.
టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు కారు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.