ఇలాంటి సీఎం ఉండటం ప్రజల అదృష్టం
కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన టీడీపీ ఎంపీ మల్లారెడ్డి
హైదరాబాద్: ‘‘తెలంగాణ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి కావడం ప్రజల అదృష్టం. ఈ రోజు తెలంగాణలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పట్టాలకు నోచుకోకుండా ఉన్న పేదలకు ఇళ్ల పట్టాలు వస్తున్నాయంటే.. వారికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు లెక్క... వాళ్లంతా ఇప్పుడు ఆనందంగా ఉన్నారు.
ఇదంతా సీఎం కేసీఆర్ ఘనతే. సీఎంకు జోహార్లు...’’ అంటూ మల్కాజిగిరి ఎంపీ, టీడీపీ నేత మల్లారెడ్డి సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
అర్హులైన పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆ నియోజకవర్గం ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ.. ‘మనకు మంచి సీఎం దొరికారు. కష్టపడి పనిచేస్తున్నారు. కానీ, ఒక్క ముఖ్యమంత్రి తోనే అభివృద్ధి సాధ్యం కాదు. అందరం కష్ట పడితేనే తెలంగాణ ప్రపంచంలోనే నంబర్ వన్ రాష్ట్రం అవుతుంది’ అని పేర్కొన్నారు. ఇప్పటికే సీఎం తన నియోజకవర్గానికి 4 సార్లు వచ్చారని, రూ.330 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని... ఇదంతా మల్కాజిగిరి ప్రజల అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.