
తప్పనిసరయ్యే టీడీపీతో పొత్తు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ జాతీయ పార్టీ గనుక ఢిల్లీ స్థాయిలో విశాల దృక్పథంతో నిర్ణయాలుంటాయన్నారు. టీడీపీతో కలిసి బల్దియా ఎన్నికల్లో గెలుస్తామని మంగళవారం ‘సాక్షి’ టీవీ ఫోర్త్ ఎస్టేట్ చర్చా కార్యక్రమంలో ధీమా వెలిబుచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత 2019లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.
తెలంగాణలో పర్యటించేందుకు ప్రధాని మోదీ ఆసక్తి చూపుతున్నా టీఆర్‌ఎస్‌కే అది ఇష్టం లేదన్నారు. ‘‘త్రిపురలో కమ్యూనిస్టు ప్రభుత్వమున్నావాళ్లు ఆహ్వానిస్తే ప్రధాని వెళ్లారు. కానీ రాష్ట్ర సర్కారు మాత్రం ఆయనను ఇప్పటిదాకా ఒక్క అధికారిక కార్యక్రమానికీ ఆహ్వానించలేదు. సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి కేంద్రం నుంచి ప్రతినిధి బృందం రావడానికి ఆసక్తి కనబరిచినా టీఆర్‌ఎస్ నేతలే వద్దన్నారు. తెలంగాణకు నిధుల మంజూరులో కేంద్రం ఎక్కడా వివక్ష చూపలేదు.ఇప్పటికే రూ.లక్ష కోట్లకు పైగా ఇచ్చింది. కానీ దీన్ని ప్రచారం చేసుకోవడంలో మాత్రం బీజేపీ విఫలమైంది’’ అన్నారు.