పీవీ రాజేశ్వరరావుకు కన్నీటి వీడ్కోలు
- తరలివచ్చిన కాంగ్రెస్ ప్రముఖులు.. భౌతికకాయం గాంధీభవన్‌కు తరలింపు
- మహాప్రస్థానంలో ముగిసిన అంత్యక్రియలు
హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తనయుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ లోక్‌సభ సభ్యుడు పీవీ రాజేశ్వరరావుకు ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. తీవ్ర అనారోగ్యానికి గురై సోమవారం సాయం త్రం రాజేశ్వరరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఆదర్శనగర్‌లోని స్వగృహంలో ఆయన భౌతికకాయానికి మం గళవారం పలువురు కాంగ్రెస్ ప్రముఖులు నివాళులు అర్పించారు. పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, కాంగ్రెస్ నేతలు జైపాల్‌రెడ్డి, సుబ్బిరామిరెడ్డి జానారెడ్డి, శ్రీధర్‌బాబు, దానం నాగేందర్, అంజన్‌కుమార్ యాదవ్, సంతోష్‌రెడ్డి, శ్రీచరణ్‌జోషి, దైవజ్ఞశర్మ తదితరులు రాజేశ్వరరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. రాజేశ్వరరావు భార్య రాధిక, కుమారుడు రాఘవేంద్ర కశ్యప్, కుమార్తెలు సత్యశ్రీ, విశాలలను పరామర్శించి సానుభూతిని ప్రకటించారు.
భౌతికకాయం గాంధీభవన్‌కు తరలింపు
ఇతర కాంగ్రెస్ నేతల సందర్శనార్ధం రాజేశ్వరరావు భౌతికకాయాన్ని గాంధీ భవన్ కు తరలించారు. ఇక్కడ గంట పాటు ఉంచి అనంతరం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థా నానికి తరలించి అంత్యక్రియలను పూర్తి చేశారు. అంతిమయాత్రలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గాంధీభవన్‌లో నివాళులు
పీవీ రాజేశ్వరరావు భౌతికకాయానికి హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో పలువురు నేతలు మంగళవారం నివాళులర్పించారు. అనారోగ్యంతో సోమవారం తుదిశ్వాస విడిచిన రాజేశ్వరరావు భౌతిక కాయాన్ని కార్యకర్తలు, అభిమానుల సందర్శన కోసం గాంధీభవన్‌లో మంగళవారం కొద్దిసేపు ఉంచారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రులు డి.శ్రీధర్ బాబు, దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.