తెలంగాణలో వనరులకు కొదవలేదు
మంత్రి ఈటల రాజేందర్
క్వాలిటీ టీమ్ కాన్సెప్ట్‌కు అవార్డుల ప్రదానం
సనత్‌నగర్ : ఏరంగంలో రాణించాలన్నా సమర్థతే ప్రధానమని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపే వనరులకు ఇక్కడ కొదవ లేదని స్పష్టం చేశారు. క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా (క్యూసీఎఫ్‌ఐ) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే 29వ చాప్టర్ కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కాన్సెప్ట్స్ సోమవారం బేగంపేట్‌లోని మ్యారీ గోల్డ్ హోటల్‌లో ప్రారంభమైంది. దీనికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత ప్రపంచంలో ప్రజలకు అవసరమయ్యే కొత్త ఉత్పత్తుల తయారీకి సృజనే ఆధారమని పేర్కొన్నారు.
నేడు ప్రపంచదేశాలు హైదరాబాద్ వైపు చూస్తున్నారని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మానవ సంపద, కరెంటు సరఫరాతో పాటు సేఫ్ జోన్‌గా భావిస్తున్నాయన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా- ఎ విజన్ థ్రూ క్వాలిటీ కాన్సెప్ట్స్’ అంశంపై క్యూసీఎఫ్‌ఐ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సీహెచ్. బాలకృష్ణారావు అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది. ఇందులో ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, క్యూసీఎఫ్‌ఐ హైదరాబాద్ చాప్టర్ వైస్ చైర్మన్ కె.మనోహర్ హెగ్డె, గౌరవ కార్యదర్శి విశాల్ కరణ్ తదితరులు పాల్గొన్నారు.
కాగా క్వాలిటీ టీమ్ కాన్సెప్ట్‌లో ప్రతిభ కనబరిచిన పలు సంస్థలకు క్యూసీఎఫ్‌ఐ అవార్డులను ప్రదానం చేశారు. బీహెచ్‌ఈఎల్, ఎన్‌ఎండీసీ, ఎన్‌టీపీసీ (రామగుండం), ఉషా ఇంటర్నేషనల్, అమరరాజా బ్యాటరీస్, రామ్‌కో సిమెంట్స్ లిమిటెడ్, టీఎస్ ఆర్టీసీ సంస్థల ప్రతినిధులు అవార్డులను అందుకున్నారు.