
చంద్రబాబును ఎవరూ నమ్మడం లేదు: తలసాని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశాలు తిరుగుతున్నప్పటికీ పెట్టుబడులైతే రావడం లేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశాలు తిరుగుతున్నప్పటికీ పెట్టుబడులైతే రావడం లేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన అసెంబ్లీ లాబీలో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ఏం మాట్లాడారంటే..
'పారిశ్రామిక వేత్తలెవరూ చంద్రబాబును నమ్మలేదనడానికి పెట్టుబడులు రాకపోవడమే నిదర్శనం. చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆ ప్రాంత స్నేహితులు నాకు చెబుతున్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇవ్వలేక ఇబ్బంది పడ్డారు. వైఎస్ జగన్ను టార్గెట్ చేయడానికి మొత్తం మంత్రివర్గాన్ని వాడుకుంటున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వైఎస్ జగన్ ఒక్కరే కాదు.. ఇతర విపక్ష పార్టీ నేతలందరూ దూరంగా ఉన్నారు.
ఉమ్మడి రాష్ట్ర సీఎంగా మాల, మాదిగల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టారు. ఇప్పుడు ఏపీలో మరోసారి కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. కాపులు, బీసీల మధ్య పెడుతున్న చిచ్చు తిరిగి ఆయన మెడకే చుట్టుకుంటుంది. హామీలు నెరవేర్చకపోవడంతోనే ఏపీలో కాపులు ఉద్యమ బాట పట్టారు. బడ్జెట్లో కాపులు కేటాయించిన రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తారనేది అనుమానమేనని' తలసాని దుయ్యబట్టారు.