
టెట్ ఉండాల్సిందే!
ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో అర్హత సాధించి ఉండాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.
గురుకుల ఉపాధ్యాయ నియామకాలపై స్పష్టత ఇచ్చిన విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో అర్హత సాధించి ఉండాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాల్లో టెట్‌కు వెయిటేజీ ఇవ్వాలా, వద్దా అన్నదానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. దీనిపై ఇదివరకే ప్రభుత్వానికి లేఖ రాసినట్లు పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ వెల్లడించారు. గురుకుల పాఠశాలల్లో టీజీటీగా నియమితులయ్యేవారు 8వ తరగతి వరకు బోధిస్తారు కాబట్టి టెట్‌లో అర్హత సాధించిన వారినే ఆ పోస్టుల భర్తీ పరీక్ష రాసేందుకు అనుమతించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
గురుకుల పోస్టులపై గందరగోళం: రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలకు ప్రభుత్వం ఇటీవల పరీక్షల విధానాన్ని (స్కీం) ప్రకటించింది. అందులో టెట్ ప్రస్తావన లేదు. దీంతో టెట్‌లో అర్హత సాధించిన వారే ఆ పరీక్ష రాయాలా, అర్హత సాధించని వారు కూడా రాయవచ్చా అన్న గందరగోళం నెల కొంది. అసలు ఇప్పటివరకు విద్యాశాఖ చేపడుతున్న ఉపాధ్యాయ నియామక పరీక్షకు 80 శాతం, టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఇవ్వాలన్న నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో గురుకుల టీచర్ల భర్తీలో టెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలా, వద్దా.. అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ప్రభుత్వం విద్యాశాఖను వివరణ కోరగా.. నిబంధనల ప్రకారం టెట్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లందరికీ టెట్ తప్పనిసరని ఎన్‌సీటీఈ చెబుతోందని పేర్కొంది. అయితే టెట్ స్కోర్‌కు వెయిటేజీ ఇస్తారా, లేదా... టెట్‌ను అర్హత పరీక్షగానే చూడాలా అన్న విషయంలో గురుకుల సొసైటీలు, ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని సూచించింది.