ఇక చవకగా ‘మన కూరగాయలు’!
- ప్రత్యేక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్న సర్కారు
- హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో వందకు పైగా ఔట్‌లెట్లు
- ప్రయోగాత్మకంగా ఇప్పటికే ఓ ఔట్‌లెట్ ప్రారంభం
- సేకరణ, విక్రయ బాధ్యతలు ప్రైవేటు సంస్థలకు అప్పగింత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, వినియోగదారులకు తక్కువ ధరకే కూరగాయలు అం దించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మన కూరగాయలు’ పేరుతో ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. దీనిపై వ్యవసాయ మార్కెటింగ్ విభాగం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుతమున్న రైతు బజార్లలో సేవలు మెరుగుపరుస్తూనే ‘మన కూరగాయలు’ పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. వాస్తవానికి మన కూరగాయలు పేరిట మార్కెటింగ్ శాఖ ఇప్పటికే రైతుల నుంచి కూరగాయలు కొనుగోలు చేసి.. రైతుబజార్లు, ప్రభుత్వ కార్యాలయాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా విక్రయిస్తోంది. తాజాగా ‘మన కూరగాయలు’ ఔట్‌లెట్ల ఏర్పాటుపై దృష్టి సారిం చింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో వందకు పైగా మన కూరగాయలు ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రయోగాత్మకంగా నారాయణ గూడలోని బీఎస్ మెల్కోటే పార్కులో తొలి ఔట్‌లెట్‌ను ప్రారంభించారు.
సేకరణ, విక్రయ బాధ్యత ప్రైవేటుకు..
సేకరణ కేంద్రాల్లో రైతుల నుంచి కూరగాయలు కొనుగోలు చేసే బాధ్యతను ‘ఫాం ఫిక్స్’ అనే ఏజెన్సీకి అప్పగించారు. సేకరించిన కూరగాయలను ఈ ఏజెన్సీ బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు తరలిస్తుంది. అక్కడ గ్రేడింగ్, సార్టింగ్ చేసి రైతు బజార్లు, ‘మన కూరగాయలు’ ఔట్‌లెట్లకు సరఫరా చేసి, విక్రయించేలా ప్రణాళిక రూపొందించారు. రైతులకు సొమ్మును నేరు గా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా రోజుకు 15 నుంచి 20 టన్నుల కూరగాయలు సేకరించి.. రైతుబజార్లు, ఔట్‌లెట్ల ద్వారా విక్రయిస్తున్నారు. ఇక ఔట్‌లెట్ల ఏర్పాటు, నిర్వహణ, కూరగాయల విక్రయ బాధ్యతలను జెనెరా అగ్రిక్రాప్ అనే సంస్థకు అప్పగించారు.
తక్కువ ధరల్లో అందుబాటులోకి..
కూరగాయల సాగులో రాష్ట్రం విస్తీర్ణం పరంగా దేశంలో 11వ స్థానం, ఉత్పత్తిలో 13 స్థానంలో ఉంది. వాస్తవానికి స్థానిక అవసరాల్లో కేవలం 20 శాతం కూరగాయలు మాత్రమే రాష్ట్రంలో సాగవుతున్నాయి. మిగతావి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల నుంచి దిగుమతి అవుతున్నాయి. దళారుల ప్రమేయంతో కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి. దీంతో ధరలను కట్టడి చేసేందుకు ‘మన కూరగాయలు’ విధా నం దోహదం చేస్తుందని మార్కెటింగ్ శాఖ అంచనా వేస్తోంది. రైతుల నుంచి సేకరించే హోల్‌సేల్ ధరకు అదనంగా గరిష్టంగా 30 శాతం ధరతో ‘మన కూరగాయలు’ అందుబాటులోకి రానున్నాయి. రైతుల నుంచి కూర
గాయల సేకరణ మొదలుకుని విక్రయాల వరకూ కంప్యూటర్ ఆధారిత లావాదేవీలు చేపట్టడం ద్వారా పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ ఎండీ శరత్ వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఈ ఔట్‌లెట్ల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే స్థలాలను గుర్తించారు.
మూడు జిల్లాల నుంచి సేకరణ
మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో రైతుల నుంచి కూరగాయలు నేరుగా కొనుగోలు చేసేందుకు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 21 సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల్లో కూరగాయలు విసృ్తతంగా సాగయ్యే ప్రాంతాల్లో ఎనిమిది కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఈ కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి మార్కెట్‌లో ఉండే హోల్‌సేల్ ధరలకు అనుగుణంగా... కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి కూరగాయలు కొనుగోలు చేస్తారు.