* పాడి పశువుల్లో పాల దిగుబడి పెంపునకు తయారీ
* ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు ముగ్గురు నిందితుల అరెస్ట్
* వెయ్యి స్టెరాయిడ్ బాటిళ్ల స్వాధీనం
హైదరాబాద్: పాడి పశువుల్లో అధిక పాల దిగుబడి కోసం నగరంలో (హైదరాబాద్) ఆక్సిటోసిన్ ఉత్ప్రేరకాల (స్టెరాయిడ్)ను తయారు చేసి మార్కెట్‌లో చెలామణి చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ముఠాలోని ముగ్గురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి వెయ్యి స్టెరాయిడ్ బాటిళ్లతోపాటు తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కార్యకలాపాల వివరాలను నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం...బహదూర్‌ఫురా కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన వ్యాపారి లచ్చు రాయి (34) అనే వ్యక్తి ఏడాదిగా ఆక్సిటోసిన్ స్టెరాయిడ్ తయారు చేస్తున్నాడు.
దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఠాకూర్ సుఖ్‌దేవ్‌సింగ్ , చార్మినార్ జోన్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ రఫీలు సంయుక్తంగా దాడులు చేసి శనివారం బహదూర్‌పురాలో రెండు కాటన్లతో తచ్చాడుతున్న లచ్చు రాయిని అదుపులోకి తీసుకోగా అతని వద్ద 40 బాటిళ్ల ఆక్సిటోసిన్ స్టెరాయిడ్స్ లభ్యమయ్యాయి. సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ వ్యాపారం చేస్తున్నానని పోలీసుల విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు. లెసైన్స్ కలిగిన ఔషద దుకాణం నుంచి రసాయనాలు కొనుగోలు చేసి 150 మిల్లీ లీటర్ల బాటిళ్లలో స్టెరాయిడ్‌ను తయారు చేస్తున్నట్లు నిందితుడు తెలిపాడు. ఇలా తయారు చేసిన ఒక్కో స్టెరాయిడ్ బాటిల్‌ను చార్మినార్ ప్రాంతానికి చెందిన ముఖేశ్ అగర్వాల్(40)కు రూ. 10 చొప్పున విక్రయిస్తున్నట్లు వివరించాడు.
ఫలక్‌నుమాలో డెయిరీ ఉత్పత్తుల దుకాణం నిర్వహించే ముఖేశ్ తన వద్దకు వచ్చే వినియోగదారులకు ఒక్కో బాటిల్‌ను రూ. 20 నుంచి రూ. 25కు వరకు విక్రయిస్తున్నాడు. లచ్చు రాయి అందించిన వివరాల ఆధారంగా ముఖేశ్ అగర్వాల్, ఈద్‌బజార్‌లో మెడికల్ షాప్ నిర్వహిస్తున్న షేక్ అబ్దుల్ ఖలీద్ అలియాస్ అఫ్రోజ్ అలియాస్ నాసర్ అలీ అలియాస్ నానబా (30)లను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. యూపీకి చెందిన మోసిన్ అనే దళారీ నుంచి స్టెరాయిడ్ తయారీ ముడిసరుకును అబ్దుల్ ఖలీద్ కొనుగోలు చేసి స్టెరాయిడ్స్‌ను విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు మోసిన్ పరారీలో ఉన్నట్లు చెప్పారు.
స్టెరాయిడ్స్‌తో పా‘పాలు’!
Published Sun, Mar 6 2016 2:38 AM | Last Updated on Sun, Sep 3 2017 7:04 PM
Advertisement
Advertisement