
రాజ్యసభకు నాలుగో అభ్యర్థి అనైతికం
అధికార పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకున్న చరిత్రే లేదు: ఉమ్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభలో ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని గెలిపించుకునేంత బలం లేకున్నా అధికారంలో ఉన్న పార్టీ ఆ స్థానానికి అభ్యర్థిని పోటీ పెట్టాలనే ఆలోచనకు రావడమే అనైతిక చర్య అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఇలాంటి అనైతిక చర్యలు పాల్పడిన సందర్భాలు గతంలో ఎన్నడూ లేవన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్.దుర్గాప్రసాదరాజు తదితరులు సోమవారం సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌తో భేటీ అయ్యారు.
అనంతరం ఉమ్మారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేవారు పార్టీ అభ్యర్థిగా గుర్తింపు కోసం ఫారమ్-ఎ, ఫారమ్-బీ పత్రాలను అందజేయాల్సిన అవసరం ఉందని.. ఆ మేరకు ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఆయా పత్రాలను అందజేశామని తెలిపారు. ఒక రాజ్యసభ సీటు గెలుచుకోగల మెజార్టీ తమ పార్టీకి ఉందని, ఎవరు ఎలాంటి అనైతిక చర్యలకు పాల్పడినా పోటీ చేస్తున్న ఒక్క సీటును వైఎస్సార్‌సీపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
మరో సెట్ నామినేషన్ వేసిన విజయసాయిరెడ్డి
విజయసాయిరెడ్డి సోమవారం మరో సెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎస్.దుర్గాప్రసాద్‌రాజుతో కలసి అసెంబ్లీకి వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.సత్యనారాయణకు నామినేషన్‌ను అందజేశారు. తొలుత ఈ నెల 26న ఆయన రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఇలావుండగా కేంద్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి కార్యాయం నుంచి విడుదలైన ప్రకటన విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు విషయాన్ని ధ్రువీకరించింది.