
రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తా
రాజ్యసభ సభ్యునిగా ధ్రువపత్రం అందుకున్న విజయసాయిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాలకోసం గట్టిగా కృషి చేస్తానని వైఎస్సార్‌సీపీ తరఫున తొలి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేణుం బాక విజయసాయిరెడ్డి చెప్పారు. రాజ్యసభ అంటే రాష్ట్రాలసభ కనుక రాష్ట్రానికి ప్రత్యేక హోదా మొదలు అన్ని అంశాల సాధనకోసం తన వాణిని వినిపిస్తానన్నారు. ఇటీవల ముగిసిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన బుధవారం అసెంబ్లీ ఇన్‌చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ నుంచి తన ధ్రువపత్రాన్ని స్వీకరించారు.
మండలిలో వైఎస్సార్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్.దుర్గాప్రసాదరాజుతోపాటు పెద్దసంఖ్యలో పార్టీ నేతలు వెంటరాగా ఆయన ఉదయం 11 గంటలకు కార్యదర్శి చాంబర్‌కు వెళ్లి తాను రాజ్యసభకు ఎన్నికైనట్లు ధ్రువీకరించే పత్రాన్ని(సర్టిఫికెట్ ఆఫ్ ఎలక్షన్) తీసుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ తరఫున ఏకైక సభ్యునిగా తాను అద్భుతాలు సాధిస్తానని ప్రగల్భాలు పలకట్లేదని, అయితే ఎక్కడా ఎలాంటి లోపాల్లేకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకోసం గట్టిగా కృషి చేస్తానన్నారు. పార్లమెంటులో విధాన నిర్ణేతల్లో ఒకనిగా కొట్టొచ్చేవిధంగా తన పాత్రను నిర్వహిస్తానన్నారు.
తమ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి సూచనల మేరకు చిత్తశుద్ధితో చర్చలన్నింటిలోనూ పాల్గొంటూ ఆరేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఆశిస్తున్నానని చెప్పారు. కాగా, వైఎస్సార్‌సీపీ నుంచి మొట్టమొదటిగా రాజ్యసభలో ప్రవేశించడానికి తనకు అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తాను తొలుత హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని విజయసాయిరెడ్డి అన్నారు. పీఏసీ సమావేశంకోసం అసెంబ్లీకి వచ్చిన చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, విజయసాయిరెడ్డిని అభినందించారు.