ప్రభుత్వాస్పత్రుల్లో.. ఆ ఒక్కటీ అడక్కు..! | The odor of the hospital wards | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాస్పత్రుల్లో.. ఆ ఒక్కటీ అడక్కు..!

Published Thu, Mar 10 2016 12:17 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

ప్రభుత్వాస్పత్రుల్లో..  ఆ ఒక్కటీ అడక్కు..! - Sakshi

ప్రభుత్వాస్పత్రుల్లో.. ఆ ఒక్కటీ అడక్కు..!

కానరాని పారిశుద్ధ్యం
ప్రధాన ఆస్పత్రుల వార్డుల్లో దుర్వాసన
గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌లోనూ అదేతీరు
రూ.కోట్లు వెచ్చించినా మెరుగు పడని పరిస్థితి

 
సిటీబ్యూరో:   రోగమొచ్చి ప్రభుత్వాస్పత్రికి వస్తే.. కొత్త రోగాలు అంటుతున్నాయి. ప్రధాన గేటు నుంచి మొదలయ్యే
 దుర్వాసన ప్రధాన వార్డుల్లోనూ వదలడం లేదు. వార్డులు.. మరుగుదొడ్లకు పెద్ద తేడా కనిపించడం లేదు. సిరెంజీలు, ఇతర బయోమెడికల్ వ్యర్థాలు వార్డుల్లోనే కుప్పలుగా పేరుకుపోతున్నాయి. రోజుల తరబడి మరుగుదొడ్లను శుభ్రం చేయకపోవ డంతో ఉస్మానియా, గాంధీ సహా సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, నయాపూల్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, ఈఎన్‌టీ, ఫీవర్, ఛాతి, మానసిక చికిత్సాలయం, సరోజినిదేవి కంటి ఆస్పత్రుల్లోని వార్డుల్లో దుర్వాసనకు రోగుల ముక్కుపుటాలు అదురుతున్నాయి. పారిశుద్ధ్యం కోసం ప్రభుత్వం వెచ్చిస్తోన్న కోట్లాది  రూపాయలు వ్యర్థాల్లో మురిగిపోతున్నాయి. బుధవారం పలు ఆస్పత్రుల్లో ‘సాక్షి’ పరిశీలించగా.. అక్కడి పరిస్థితితులు దారుణంగా కనిపించాయి.
 
నిలోఫర్.. చిన్నారులకు డర్..
రాష్ట్రలోనే అతిపెద్ద చిన్నపిల్లల ఆస్పత్రిగా ‘నిలోఫర్’కు గుర్తింపు ఉంది. చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. కానీ ఈ ఆస్పత్రిలో ఆ జాగ్రత్తలు మచ్చుకు కూడా కానరావు. నిలోఫర్‌లో పారిశుద్ధ్య నిర్వాహణకు ప్రభుత్వం నెలకు రూ.8.38 లక్షలు వెచ్చిస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి రోజూ రెండు పూటలా ఫినాయిల్‌తో వార్డులను శుభ్రం చేయాలి. కానీ ఇక్కడ అసలు ఫినాయిలే వాడటం లేదు. కేవలం తడిగుడ్డతో తుడిచేసి చేతులు కడిగేసుకుంటున్నారు. ఆస్పత్రి నుంచి వెలువడుతున్న బయె ూమెడికల్ వ్యర్థాలను వేరు చేయకుండా సిబ్బంది అన్నింటినీ ఒకే మూటలో కట్టేస్తున్నారు. ఎప్పటికప్పుడు వీటిని బయటికి తరలించాల్సింది పోయి క్యాంటీన్ సమీపంలోని ఖాళీ స్థలంలో పోగేస్తున్నారు. వీటి మూలంగా చిన్నపిల్లలకు బాక్టీరియా, ఇతర వైరస్ బారిన పడుతున్నారు. ఆస్పత్రిలో రోజుకు సగటున ఐదు నుంచి మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ప్రతి 10 మందిలో ఒకరు ఇన్‌ఫెక్షన్ వల్లే చనిపోతున్నట్టు స్వయంగా ఆస్పత్రి వైద్యులే అంగీకరిస్తున్నారంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
 
నిబంధనల ప్రకారం శుభ్రత ఇలా ఉండాలి..
ఆస్పత్రి పరిసరాలను రోజుకు ఒకసారి శుభ్రం చేయాలి. ఓపీని రోజుకు రెండుసార్లు, జనరల్ వార్డులను మూడు సార్లు, ఆపరేషన్ ధియేటర్లను ఐదుసార్లు శుభ్రపరచాలి.ఎన్‌ఐసీయూ, ఇతర అత్యవసర విభాగాలను రోజుకు ఏడు సార్ల చొప్పున శుభ్రపరచాలి.{పతి 15 రోజులకోసారి గోడలు, కిటీకీలు, మంచాలు, తలుపులు శుభ్రం చేయాలి.నెలకోసారి వాటర్ ట్యాంకులను క్లీన్ చేయాలి. మరుగుదొడ్లు, మూత్ర శాలల్లో రోజుకోసారి బ్లీచింగ్ చల్లాలి.  దీన్ని శానిటేషన్ ఏజెన్సీలు ఇవేవీ పట్టించుకోవడం లేదు. వార్డులను తడిగుడ్డతో ఊడ్చుతున్నారే తప్ప కనీసం ఫినాయిల్ కూడా వాడటం లేదు. వార్డుల్లో డస్ట్‌బిన్లు  ఏర్పాటు చేయాలనే నిబంధన ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.
 
 ఉస్మానియాలో అవినీతి ‘కంపు’
 
కాంట్రాక్టర్ల అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనత, పర్యవేక్షణ లోపం వెరసి ‘ఉస్మానియా’ రోగుల పాలిట శాపంగా మారుతోంది. ఆస్పత్రిలో పారిశుద్ధ్యం కోసం నెలకు రూ.29 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ 270 మందికి 200 మందికి మించి కార్మికులు లేరు. దీంతో ఓపీతో పాటు ఇన్ పేషంట్ వార్డుల్లో చెత్త పేరుకు పోయి తీవ్ర దుర్వాసన వె దజల్లుతున్నాయి. క్యాజువాలిటీ వెనుక భాగంలోని ఎన్‌ఐసీయూ పక్కనే టాయిలెట్లు పొంగుతున్నాయి. వార్డుకు సమీపంలోనే మూత్ర విసర్జన చేస్తుండటంతో ఆ పరిసరాలు దారుణంగా ఉన్నాయి. అవుట్ పేషంట్ వార్డుతో పాటు కులీ కుతుబ్‌షా భవనంలో డ్రైనేజ్ లీకవుతోంది. వార్డుల్లో చుట్టూ మురుగునీరు ప్రవహిస్తోంది. ఎలుకలు, పందికొక్కులు స్వైరవిహారం చేస్తున్నాయి. వాటర్ ట్యాంక్‌లను శుభ్రం చేయక పోవడంతో నీరు తాగిన రోగులు కొత్త రోగాలు తెచ్చుకుంటున్నారు. సిరెంజ్‌లు, బ్లేడ్స్ వంటి క్లినికల్ వ్యర్థాలను వార్డుల్లోనే వదిలేస్తున్నారు.  
 
మారని ‘గాంధీ’ తీరు..
గాంధీ జనరల్ ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ పనులకు ప్రభుత్వం నెలకు రూ. 23.7 లక్షలు ఖర్చు ఖర్చు చేస్తోంది. కానీ రోజుల తరబడి వ్యర్థాలను తొలగించక పోవడంతో వార్డులు చెత్త కూపాలుగా మారిపోయాయి. ఇక్కడ బయో మెడికల్ వ్యర్థాల నిర్వాహణ దారుణంగా ఉంది. ఆస్పత్రి ఆవరణలో క్లినికల్ ప్లాంట్ ఉన్నా.. అధికారుల నిర్లక్ష్యం వల్ల మూలనపడింది. లేబర్ రూమ్‌తో పాటు పలు వార్డుల్లోని పారి శుద్ధ్య నిర్వాహణ అత్యంత అద్వానంగా మారింది. ఇటీవల రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సైతం ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ చేసి పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సాక్షాత్తూ గవర్నర్ హెచ్చరించినా ఆస్పత్రిలోని పారిశుద్ధ్య నిర్వహణ తీరు మాత్రం మారకపోవడం గమనార్హం.
 
‘పేట్లబురుజు’లో నిర్లక్ష్యం..
బహదూర్‌పురా: పేట్లబురుజులోని ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆస్పత్రిని లేబర్ రూంలో పారిశుద్ధ్యం అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ పేరుకుపోతున్న చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం లేదు. ఆవరణలోని క్యాంటీన్ బయట డ్రైనేజీ మురుగునీరు నిలిచిపోతున్నా సరిచేసే దిక్కులేదు. రోగులకు ఆహారం సరఫరా చేసే క్యాంటీన్‌లోనూ అపరిశుభ్రత తాండవిస్తున్నా అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో శానిటేషన్ విభాగంలో 69 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి ప్రతి నెల ప్రభుత్వం రూ. 15 లక్షల నిధులను ఆల్ గ్లోబల్ సర్వీసు సంస్థ కాంట్రాక్టర్‌కు చెల్లిస్తోంది. ఆసుపత్రి వ్యర్థాలు, చెత్తను తొలగించడం, ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచడంలో కాంట్రాక్టర్ అసలు పట్టించుకోవడం లేదు. తక్కువ సిబ్బందితో పని కానిచ్చేస్తూ చేతులు దులుపుకుంటున్నాడు. ఆరోగ్యం కోసం ఆస్పత్రికి వస్తున్న గర్భిణులు, వారి సహాయకులు అపరిశుభ్ర వాతావరణంతో రోగాల బారిన పడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement