
పేద క్రైస్తవులకు జెరూసలేం యాత్ర
ఆర్థిక స్తోమతలేక ఎంతోమంది పేద క్రైసవులు జెరూసలేం వెళ్లలేకపోతున్నారని, యాత్ర కోసం వారందరికీ
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక స్తోమతలేక ఎంతోమంది పేద క్రైసవులు జెరూసలేం వెళ్లలేకపోతున్నారని, యాత్ర కోసం వారందరికీ ప్రభుత్వపరంగా సాయం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రప్రథమంగా నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన క్రిస్మస్ సంబరాల్లో సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. క్రైస్తవులకు సంబంధించిన పలు సమస్యలపై ప్రకటనలేమైనా చేద్దామంటే స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిందని సీఎం చెప్పారు. ఎన్నికల కోడ్ ఉందంటూనే కొన్ని సమస్యలకు సంబంధించి స్పష్టమైన హామీలిచ్చారు.
క్రైస్తవ శ్మశాన వాటికలన్నీ సమాధులతో నిండిపోయినందున స్థలాలు కావాలని మతపెద్దలు కోరినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ స్థలాలు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వ స్థలాలు లేనిచోట కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. పాఠశాలల ఏర్పాటు, వివిధ క్రైస్తవ సామాజిక కార్యక్రమాలకు రాయితీలు తదితర అంశాలపై జనవరిలో మతపెద్దలతో ప్రత్యేక కమిటీ నియమించి, చర్యలు చేపడతామన్నారు.
ఆనందంగా జీవిస్తేనే...
అన్ని వర్గాలు, అన్నిమతాల ప్రజలు గౌరవంతో ఆనందంగా జీవించేదే మంచి రాజ్యమని సీఎం కేసీఆర్ చెప్పారు. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కవనే భేదాభిప్రాయాలు లేకుండా అందరితో సమానంగా క్రైస్తవులు గౌరవం పొందేలా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. సర్వమతాల ప్రజలు సమానంగా ఆదరణ పొందాలన్నదే తన లక్ష్యమని, ఈ విషయాన్ని ఎన్నికల ప్రచార సభల్లోనే తాను ప్రకటించానని గుర్తు చేశారు. అందుకే అన్ని మతాలవారు జరుపునే పండుగలకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకం అందిస్తున్నామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో క్రైస్తవ సమాజ ం సంపూర్ణ భాగస్వామ్యం వహించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.
దళిత క్రిస్టియన్ల సమస్యలను పార్లమెంట్‌లో తమ పార్టీ తరఫున ప్రస్తావించేందుకు చర్యలు చేపడతానన్నారు. ఈ విషయమై ప్రధానమంత్రికి తాను స్వయంగా లేఖ రాయనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 15 ఏళ్లుగా చాపెల్‌రోడ్ (హైదరాబాద్)లోని చర్చికి తాను క్రిస్మస్ రోజున వెళ్తున్నానని ఈ దఫా అయుత చండీయాగం కారణంగా వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు. తన తరఫున కుటుంబ సభ్యులను పంపనున్నట్లు తెలిపారు. అందరి జీవితాల్లో సుఖశాంతులు నెలకొనాలని, ఏసుక్రీస్తు కృపతో అందరూ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నానంటూ క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
క్రిస్మస్ సంబరాల్లో భాగంగా సుమారు ఐదువేల మందికి పసందైన వంటకాలతో ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల కుటుంబాల్లోని ఆరు లక్షల మందికి క్రిస్‌గిఫ్ట్‌లను ప్రభుత్వం తరఫున అందజేసినట్లు అధికారులు తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లోనూ క్రిస్మస్ సంబరాలు నిర్వహించామని, గ్రేటర్ పరిధిలో 100 ప్రాంతాల్లో ఉత్సవాలు జరిగాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాసయాదవ్, ఎంపీలు కేశవరావు, జితేందర్‌రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఏసీబీ డీజీ ఏకేఖాన్, ఉత్సవ కమిటీ చైర్మన్ రేమండ్ పీటర్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్‌జలీల్, డెరైక్టర్ అక్బర్, డిప్యూటీ డెరైక్టర్ సుభాష్‌చందర్, దక్షిణ మధ్య రైల్వే మాజీ ఎస్పీఆర్‌ఓ ఫెడ్రిక్ మైఖేల్, క్రైస్తవ మతపెద్దలు, చర్చి బిషప్‌లు పాల్గొన్నారు.
అనాథ బాలలకు సీఎం బహుమతులు
క్రిస్మస్ సంబరాలకు హాజరైన సీఎం కేసీఆర్ ముందుగా అనాథ బాలల వద్దకు వెళ్లి వారితో కాసేపు ముచ్చటించారు. క్రిస్మస్ కేక్‌ను కట్‌చేసి వారికి తినిపించారు. చిన్నారులకు బహుమతులు అందజేశారు. అనంతరం వేదికపై కూడా క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి అతిథులకు పంచిపెట్టారు. వివిధ రంగాల్లో విశేషమైన సేవలందించిన క్రైస్తవ ప్రముఖులకు అవార్డులను అందజేశారు. పురస్కారాలు పొందిన వారిలో సిస్టర్ నిర్మల (సామాజిక సేవ), సిస్టర్ సుశీల (మెడికల్), విమల్ సుకుమార్ (ఎడ్యుకేషన్), సైబీ జోసెఫ్ (వైకల్య బాలలకు సేవ), మార్క్స్ (క్రైసవ జానపద సాహిత్యం), కృపయ్య తండ్రి(గాయకుడు), బాబురావు (క్రైస్తవ సాహిత్యం) తదితరులున్నారు.