చేనేత కార్మికులకు దక్కని ఆరోగ్య బీమా | The premium paid on the resolution of drought | Sakshi
Sakshi News home page

చేనేత కార్మికులకు దక్కని ఆరోగ్య బీమా

Published Wed, Feb 24 2016 2:49 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

చేనేత కార్మికులకు దక్కని ఆరోగ్య బీమా - Sakshi

చేనేత కార్మికులకు దక్కని ఆరోగ్య బీమా

చేతివృత్తులపై ఆధారపడిన నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్‌ఎస్‌బీవై) అమలు రాష్ట్రంలో వేలాది మంది చేనేత కార్మికులకు రెండేళ్లుగా నిలిచిపోయింది.

♦ రాష్ట్రంలో రెండేళ్లుగా నిలిచిన ఆర్‌ఎస్‌బీవై అమలు
♦ ప్రీమియం చెల్లింపుపై స్పష్టత కరువు
♦  ప్రత్యామ్నాయంపై ఖరారు కాని విధివిధానాలు
 
 సాక్షి, హైదరాబాద్: చేతివృత్తులపై ఆధారపడిన నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్‌ఎస్‌బీవై) అమలు రాష్ట్రంలో వేలాది మంది చేనేత కార్మికులకు రెండేళ్లుగా నిలిచిపోయింది. దీంతో వారంతా ఆరోగ్య బీమా సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో  చేనేత సహకార, సహకారేత రంగాల్లో సుమారు 1.10 లక్షల మంది చేనేత కార్మికులు ఉండగా 2008లో కార్మికశాఖ ద్వారా కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్‌ఎస్‌బీవై పథకం కింద సుమారు 15,700 మంది కార్మికులు ఆరోగ్య బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు.

బీమా ప్రీమియంలో 75 శాతం నుంచి 90 శాతం మేర కేంద్రం చెల్లించగా మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ వచ్చింది. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు రూ. 15 వేల విలువ చేసే వైద్యాన్ని ఉచితంగా పొందే వీలుండేది. అయితే లబ్ధిదారుల నమోదులో ప్రైవేటు బీమా సంస్థ అవకతవకలకు పాల్పడి ందంటూ 2013 సెప్టెంబర్ నుంచి పథకం అమలును కేంద్రం నిలిపేసి ఈ బాధ్యతను కేంద్ర ఆరోగ్యశాఖకు అప్పగించింది.

దారిద్య్రరేఖకు దిగువనున్న వారందరికీ ఆర్‌ఎస్‌బీవై వర్తిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించడంతో చేనేత అధికారులు దీన్ని తమకు సంబంధంలేని వ్యవహారంగా భావించి పక్కకు తప్పుకున్నారు. దీనికితోడు చేనేత కార్మికులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం పైనా స్పష్టత కొరవడటంతో రాష్ట్రం నుంచి ఒక్క చేనేత కార్మికుడు కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు చెల్లించే బీమా ప్రీమియం వాటాను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేలా చేనేత కార్మికుల కోసం ప్రత్యామ్నాయ ఆరోగ్య బీమా పథకాన్ని రూపొందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ విధివిధానాలు ఖరారు కాకపోవడంతో ప్రత్యామ్నాయ పథకం అమలుకు నోచుకోవడం లేదు. బీమా ప్రీమియం చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలని చేనేత సహకార సంఘాలు, కార్మికుల నుంచి వినతులు అందుతున్నా స్పందన కనిపించడం లేదు. అయితే రాష్ట్ర చేనేత విభాగం అధికారులు మాత్రం విధివిధానాలను మార్చిలోగా రూపొందించి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చేనేత కార్మికుల బీమా పథకాన్ని అమలు చేస్తామంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement