దేశవ్యాప్తంగా విశిష్ట ఆరోగ్య బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సోమవారం తెలిపారు.
సాక్షి, న్యూఢిల్లీ / హైదరాబాద్: ప్రతిపాదిత సార్వత్రిక ఆరోగ్య హామీ కార్యక్రమం (యూహెచ్‌ఏఎం) కింద దేశవ్యాప్తంగా విశిష్ట ఆరోగ్య బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సోమవారం తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజారోగ్య బీమా పథకమవుతుందన్నారు. ఆయన ఆరోగ్య శాఖ బాధ్యతలు చేపట్టి వంద రోజులైన సందర్భంగా ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రాష్ట్రాల్లోని మీడియాతో ముచ్చటించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఈ కొత్త బీమా పథకం ఉచితంగా వర్తిస్తుందని, ఎగువన ఉన్నవారికి నామమాత్ర ప్రీమియం ఉంటుందని తెలిపారు. ‘ప్రస్తుతం జనాభాలో 25 శాతం మందికే ఆరోగ్య బీమా ఉంది. దీన్ని క్రమంగా అందరికీ వర్తింపజేస్తాం’ అని అన్నారు. దేశవ్యాప్తంగా ఒకే ఆరోగ్య విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు.
యాంటీబయాటిక్స్‌ను అతిగా వాడొద్దు..
దేశంలో యాంటీబయోటిక్స్ మందుల వాడకం విపరీతంగా పెరిగిందని, దీనివల్ల కొత్త రోగాలు ప్రబలుతున్నాయని హర్షవర్ధన్ ఆందోళన వ్యక్తం చేశారు. రోగులకు అవసరం లేకపోయినా విచ్చలవిడిగా ఈ మందులను రాసే డాక్టర్లపై ప్రత్యేక నిఘా పెట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మాతాశిశు సంరక్షణకు కేంద్రం ప్రాధాన్యమిస్తోందని, ప్రస్తుతం ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 29 మంది చనిపోతున్నారని, 2030 నాటికి ఈ సంఖ్యను 10కి తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. వ్యాధులను త్వరగా నిర్ధారించేందుకు 21 వైరాలజీ ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని, 12 రాష్ట్రాల సీఎంలు దీని కోసం స్థలం కేటాయింపు ప్రతిపాదనలు పంపారన్నారు. వైద్యకళాశాల అడ్మిషన్లలో అన్ని వర్గాల విద్యార్థులకు సమాన అవకాశం లభించేందుకు వీలుగా నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) నిర్వహించాల్సిన అవసరముందని, దీనిపై సుప్రీం కోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ స్థితిగతులను తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు.