‘డబుల్’ ఆశ...
దరఖాస్తుల సమర్పణకు భారీ క్యూ
జన సంద్రమైన కలెక్టరేట్ ప్రాంగణం
లైన్లలో తోపులాట.. పోలీసుల లాఠీచార్జి
సొమ్మసిల్లిన నలుగురు... కొందరికి గాయాలు
డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు కలెక్టరేట్‌కు జనం పోటెత్తుతున్నారు. గ్రేటర్లో లక్ష ఇళ్లు నిర్మించి అర్హులకు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం.. వెంటనే జిల్లా యంత్రాంగం దరఖాస్తులస్వీకరణకు తెర లేపడంతో ఉదయం నుంచే కలెక్టరేట్ జనసంద్రంగా మారుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న అర్జీదారులు భారీ క్యూలో గంటల తరబడి వేచి ఉంటున్నారు. గురువారం అధిక సంఖ్యలో జనం రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. క్యూలో తోపులాట జరగడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఈ క్రమంలో కొందరు గాయపడగా.. నలుగురు అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు.
రంగారెడ్డి జిల్లా: గ్రేటర్‌లో రెండు పడక గదుల ఇళ్ల కోసం వస్తున్న అర్జీదారులతో కలెక్టరేట్ జాతరను తలపిస్తోంది. గురువారం జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కొందరు గాయపడగా.. నలుగురు అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు. ఈ ఘటనతో అధికారులు దరఖాస్తుల స్వీకరణను నిలిపివేసి గేట్లు వేయడంతో జనం పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఇంతలో పోలీసులు కల్పించుకొని... దరఖాస్తులు తీసుకుని కాంపౌండ్ వాల్ లోపలున్న అధికారులకు అందజేశారు.
గేటు ఎదుట నిరసన..
మధ్యాహ్నం తర్వాత దరఖాస్తుల స్వీకరణకు బ్రేక్ వేయడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు గందరగోళానికి గురయ్యారు. కార్యాలయం లోపలికి వెళ్లి ఉన్నతాధికారులను కలుస్తామని ముందుకొచ్చిన కొందరిని పోలీసులు అడ్డుకుని బయటకు తోసేశారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం మూసివేయడంతో పలువురు గేటు ఎదుట నిలబడి నిరసన వ్యక్తం చేశారు. తమ దరఖాస్తులు తీసుకోవాల్సిందిగా నినాదాలు చేశారు. అధికారులు మాత్రం స్థానికంగా వార్డు సభలు, గ్రామ సభలు నిర్వహిస్తామని, అక్కడే దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఆ తర్వాత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెబుతున్నారు.