ఇళ్ల దరఖాస్తులతో మహిళల క్యూ...
సిటీబ్యూరో: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవటానికి హైదరాబాద్ కలెక్టరేట్‌కు సోమవారం మహిళలు తరలి వచ్చారు. నగరంలోని వివిధ బస్తీల నుంచి మహిళలు ఇళ్ల దరఖాస్తులతో ఉదయం 8.30 గంటలకే కలెక్టరేట్‌కు వచ్చారు. మహిళల తాకి డి ఉదయం 11 గంటల వరకు పెరగటంతో...పరిస్థితిని గమనించిన గృహ నిర్మాణ శాఖ అధికారులు, పోలీసులు సమాచారం ఇచ్చారు.
సిబ్బందిని ప్రధాన గేట్ వద్ద ఉంచి ఇళ్ల దరఖాస్తులు తీసుకోటం లేదని...ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు రాగానే బస్తీ ల్లో సభలు నిర్వహించి, అక్కడికే దరఖాస్తులు తీసుకుంటామని నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. అయినా మహిళలు పోలీసులతో సహా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు మహిళలందరిని కలెక్టరేట్ నుంచి బయటకు పంపించి...ప్రధాన గేట్ మూసి వేశారు. మహిళలు, ప్రజలెవ్వరూ కలెక్టరేట్‌లోకి రాకుండా గట్టి బందోబస్తును నిర్వహించారు. త్వరలో ఇళ్ల దరఖాస్తులను మీ సేవ కేంద్రాల ద్వారా తీసుకుంటామని పేర్కొన్నారు.