అరచేతిలో నీటి వేళలు
సాక్షి, సిటీబ్యూరో : నల్లా నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియక పనులు మాను కొని కూర్చుంటున్నారా? ఇకపై ఇలా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రి, అపరాత్రి నిద్ర మానుకొని వేచి ఉండాల్సిన పనిలేదు. వినియోగదారుడి మొబైల్‌కే నీటి సరఫరా వేళల సమాచారం వస్తుంది. ఈ దిశగా జలమండలి సన్నాహాలు చేస్తోంది.
ముందుగా కూకట్‌పల్లి డివిజన్ లోని భాగ్యనగర్ సెక్షన్ పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం ఆధారంగా ఒక వీధిలో ఏ వేళకు నీటి సరఫరా జరుగుతుందో వినియోగదారుల మొబైల్ నెంబర్లకు నేరుగా సంక్షిప్త సందేశం(ఎస్‌ఎంఎస్) రూపంలో సమాచారం చేరవేయడం ఈ విధానం ప్రత్యేకత. ప్రస్తుతం ప్రధాన నగరంలో రోజువిడిచి రోజు(రెండురోజులకోమారు), శివారు ప్రాంతాల్లో మూడు లేదా నాలుగుర ోజుల కోమారు నీటిసరఫరా జరుగుతోంది.
మరికొన్ని చోట్ల వారం రోజులకోమారు మాత్రమే నల్లా నీరు వస్తోంది. పాతనగరంలోని కొన్ని ప్రాంతాలకు అర్థరాత్రి 1 లేదా 2 గంటలు, తెల్లవారుఝామున 3 లేదా 4 గంటలకు కూడా నీటి సరఫరా జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో నీళ్లకోసం జాగారం చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎస్సెమ్మెస్‌తో వినియోగదారులకు ఉపశమనం కలిగించనుంది.
ఇలా చేరవేస్తారు...
జలమండలి పరిధిలో మొత్తం 16 నిర్వహణ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 150 సెక్షన్లున్నాయి. ఒక్కో సెక్షన్‌లో 8 నుంచి 10 మంది వరకు నీటిని సరఫరా చేసే వాల్వులను నియంత్రించే లైన్‌మెన్‌లు పనిచేస్తున్నారు. భాగ్యనగర్ సెక్షన్‌లో పనిచేస్తున్న 8 మందికి జీపీఎస్ ఆధారంగా పనిచేసే చేతిలో ఇమిడే స్మార్ట్ పరికరం అందజేస్తారు. ఈ యంత్రంలో సదరు వీధిలో ఉన్న వినియోగదారుల మొబైల్ నెంబర్లు ఉంటాయి. ఆ వీధికి నీటిని సరఫరా చేసేందుకు వాల్వు తిప్పేందుకు వెళ్లిన ప్రతిసారీ యాప్‌కు గల బటన్‌ను నొక్కితే చాలు. ఆ వీధిలోని వారందరికీ నేరుగా నీటి సరఫరా సమాచారం క్షణాల్లో తెలిసిపోతుంది.
దీంతో వారు అప్రమత్తమై నీళ్లు పట్టుకునే వీలుంటుందని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. నీటిసరఫరా వేళల సమాచారం చేరవేసే జీపీఎస్ ఆధారిత యంత్రాల కొనుగోలుకు సెక్షన్‌కు రూ.5 లక్షల చొప్పున మొత్తం 150 సెక్షన్లకు రూ.7.50 కోట్లు వ్యయం అవుతుందని జలమండలి అంచనా. ఈ నిధులను ఎలా సమకూర్చుకోవాలన్నది సవాల్‌గా మారడం గమనార్హం.