నల్లగొండలో నేతలకు రక్షణలేదు
ఎమ్మెల్యే కోమటిరెడ్డి
♦ టీఆర్‌ఎస్‌లో ‘మాజీ’లు, రౌడీలు పెరిగిపోయారు
♦ పార్టీ మారాల్సిన అవసరం లేదు
♦ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నా!
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో రాజకీయ నాయకులకు రక్షణ లేకుండా పోయిందని మాజీమంత్రి, నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ లాబీల్లో బుధవారం తనను కలసిన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లో మాజీ నక్సలైట్లు, చిల్లర రౌడీలు, మామూళ్లు వసూలు చేసే వీధి గూండాలు పెరిగిపోయారని విమర్శించారు. మామూళ్ల గురించి ప్రశ్నించిన నాయకులనుచంపుతామం టూ బెదిరిస్తున్నారని ఆరోపిం చారు. ఇంత రౌడీయిజం ఏనాడూ లేదని, టీఆర్‌ఎస్ నేతల రౌడీయిజం గురించి ప్రజలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారని కోమటిరెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి మారాల్సిన అవసరం తమ అన్నదమ్ములకు లేదన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరాలంటూ చాలామంది మంత్రులు అడుగుతున్నారని వెల్లడించారు. తెలంగాణకోసం మంత్రి పదవినే త్యాగం చేశానని కోమటిరెడ్డి గుర్తుచేశారు. నల్లగొండ జిల్లాలో ఆ పార్టీకి బలమైన నాయకులు లేరన్నారు. ఓడిపోయిన తుమ్మల నాగేశ్వర్‌రావు వంటివారికే మంత్రి పదవిని ఇచ్చారని అన్నారు. అలాంటి మంత్రి పదవికోసం ఆశపడి పార్టీ మారాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌లో ఉన్నవారిని చూస్తే రాజకీయాలంటే అసహ్యం వేస్తున్నదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో పనిచేసే పరిస్థితి లేకుంటే మానేసి వ్యాపారాలు చేసుకుంటానని, ఎవరికీ భయపడేది లేదని స్పష్టంచేశారు. పీసీసీ పదవిగాని, మరో పెద్ద పదవినిగాని ఆశించడం లేదన్నారు. టీఆర్‌ఎస్‌లోకి పోవాల్సిన అవసరం లేదన్నారు. ఏప్రిల్ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నానని కోమటిరెడ్డి వెల్లడించారు. తన కుమారుడి పేరిట ఏర్పాటు చేసిన ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడతానని కోమటిరెడ్డి చెప్పారు.