
కొత్త రైల్వే ప్రాజెక్టులు లేనట్టే!
స్పష్టం చేసిన సదానందగౌడ
సాక్షి, హైదరాబాద్: ఈసారి రైల్వే బడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టులు లేనట్టే.. గతంలో మంజూరు చేసి పట్టాలెక్కని వాటిలో ముఖ్యమైన వాటికే నిధుల కేటాయింపు ఉంటుంది. రైల్వే ప్రాజెక్టుల కోసం రాష్ట్రప్రభుత్వాలు అందజేస్తున్న ప్రతిపాదనలను ఇప్పుడు పరిగణించే పరిస్థితిలో లేమని స్వయంగా రైల్వే మంత్రి సదానందగౌడ స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ కూడా ఇందుకు మినహాయింపు కాదని తేల్చిచెప్పారు.
రెండు రోజుల క్రితం సదానందగౌడను కలిసిన టీ బీజేపీ నేతలు ‘ఇప్పటి వరకు తెలంగాణకు రైల్వే ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరిగిందని, దాన్ని సరిదిద్దాలంటే అదనంగా ప్రాజెక్టులను కేటాయించాలి’ అంటూ జాబితాను ఆయన ముందుంచారు. దాన్ని సున్నితంగా తిరస్కరించిన మంత్రి ఈసారి ఏ రాష్ట్రానికీ కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయడం లేదని తేల్చేశారు.