ప్రయాణికుల భద్రత గాలికి!
- ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోని రైల్వే
- వేధిస్తున్న సిబ్బంది కొరత
- ఏళ్ల తరబడి భర్తీ చేయని ఖాళీలు
సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్: ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తరచూ పేర్కొంటున్న రైల్వే శాఖ పొదుపు పేరుతో ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతోంది. కొత్త రైల్వే లైన్లు నిర్మితమవుతున్నాయి, రైళ్ల సంఖ్య పెరుగుతోంది, అన్నింటికి మించి వాటి వేగాన్ని పెంచుతున్నారు. ఇలాంటి సమయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటంతోపాటు కీలక విభాగాల్లో సిబ్బంది సంఖ్యా పెంచాల్సి ఉంది. కానీ రైల్వే శాఖ దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. గతేడాది నవంబరులో కాన్పూరు సమీపంలో చోటుచేసుకున్న భారీ ప్రమాదం కళ్లముందు కదలాడుతుండగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో మరో భారీ దుర్ఘటన సంభవించింది.
వాతావరణమే పెద్ద శత్రువు...
చలికాలం, ఎండాకాలం, వానకాలం... రైళ్లకు పెద్ద శత్రువులు. చిన్న నిర్లక్ష్యం భారీ ప్రమాదాలకు తద్వారా తీవ్ర ప్రాణనష్టానికి కారణమవుతోంది. వానాకాలంలో మెరుపు వరదలతో ట్రాక్ దిగువ మట్టి కొట్టుకుపోయి రైళ్లు ప్రమాదాలకు గురవుతుంటాయి. తీవ్ర ఎండ, అతి చలి తీవ్రతతో ఉత్పన్నమయ్యే ప్రమాదాలను నివారించాలంటే ఆధునిక పరిజ్ఞానం తప్పనిసరి. ఇక్కడే మన రైల్వే శాఖ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి పట్టా విరగటమే కారణమన్న ప్రాథమిక అంచనాకొచ్చారు. ఆ పట్టా ఎలా విరగిందన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు.
వెంట్రుకవాసి పగులు చాలు
చలి తీవ్రంగా ఉన్నప్పుడు రైలు పట్టాలు సంకోచిస్తాయి. ఆ సమయంలో అంతర్గతంగా విపరీతమైన ఒత్తిడి పెరిగి ఉన్నట్టుండి పట్టాలు విరిగిపోతాయి. ఏమాత్రం బలహీనంగా ఉన్నా, పటుత్వం తగ్గినా, వెంట్రుకవాసి పగుళ్లున్నా పట్టాలు విరిగిపోతాయి. పట్టా తయారీలో లోపం, పాతపడటం, అరిగిపోవటం తదితర కారణాలతో చిన్నచిన్న పగుళ్లు ఏర్పడుతుంటాయి. చలికాలంలో పట్టాలు సంకోచించిన సమయంలో ఆ ప్రాంతంలో విరుగుతాయి. పగుళ్లను గుర్తించాలంటే అల్ట్రా సానిక్ పరీక్ష అవసరం. విదేశాల్లో అల్ట్రాసానిక్ పరికరాలతో కూడిన మినీ రైల్వే కార్లను వినియోగిస్తున్నారు. మనవద్ద అవి వేళ్లమీద లెక్కపెట్టేన్ని మాత్రమే ఉన్నాయి. పట్టాల కింద కంకర చెదిరినప్పుడు కుషన్ వ్యవస్థ దెబ్బతిని కూడా పట్టాలో క్రాక్స్ ఏర్పడతాయి. సకాలంలో టాంపింగ్ మెషీన్ ద్వారా దాన్ని సరిచేయకుంటే ప్రమాదం పొంచిఉన్నట్టే. కానీ, ఆ యంత్రాల కొరత తీవ్రంగా ఉంది.
ట్రాక్‌మెన్ ఖాళీలు 20 వేలు
పదేళ్ల క్రితం భారతీయ రైల్వే ఉద్యోగుల సంఖ్య 20 లక్షలు... ప్రస్తుతం 13 లక్షలు.. పదవీ విరమణ, ఇతర కారణాలతో సిబ్బంది తగ్గిపోతుంటే... జీతాల ఖర్చూ తగ్గుతోందని సంతోషిస్తున్న రైల్వే శాఖ కొత్త నియామకాలను చేపట్టడం లేదు. గతంలో ఏటా రిక్రూట్‌మెంట్ కొనసాగగా ఇప్పుడు రెండేళ్లకోమారు చొప్పున నిర్వహిస్తోంది. రైళ్ల భద్రతకు ఆయువుపట్టుగా భావించే ట్రాక్‌మెన్(గ్యాంగ్‌మెన్)ల కొరత తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా 20 వేల ఖాళీలున్నాయి. దీంతో ఉన్నవారిపై భారం పెరుగుతోంది.