నగరాన్ని వణికిస్తున్న డెంగీ
రెండు రోజుల్లో ముగ్గురు మృతి
సాక్షి, హైదరాబాద్: డెంగీ విజృంభణతో నగరవాసికి కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు అతలాకుతలమైన నగరం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తరుణంలో డెంగీ వ్యాప్తి చెందుతుండటంతో హడలిపోతోంది. మంగళ, బుధవారాల్లో నగరానికి చెందిన ఇద్దరు చిన్నారులతోపాటు ఓ వ్యక్తి డెంగీతో మృత్యువాతపడటం కలవరానికి గురిచేస్తోంది. కొత్తపేట డివిజన్ న్యూనాగోలు కాలనీకి చెందిన ప్రభాకర్‌రెడ్డి కుమార్తె వైష్ణవి (8) డెంగీతో అంకూర్ ఆస్పత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది. పహడీషరీఫ్ జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని హదీస్ ప్రాంతానికి చెందిన మహ్మద్ జాకీర్ హుస్సేన్(38) వారం రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో చేరాడు.
హుస్సేన్ డెంగీతో బాధపడుతున్నాడని వైద్యులు నిర్ధారించారు. పరిస్థితి విషమించి బుధవారం ఉదయం మృతి చెందాడు. ఇక సూరారం డివిజన్ రాజీవ్ గాంధీనగర్‌కు చెందిన కిశోర్, సౌజన్య దంపతుల కుమార్తె మందిర(8)కు వారం రోజుల క్రితం జ్వరం రావడంతో షాపూర్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. డెంగీ నిర్ధారణ కావడంతో మెరుగైన చికిత్స కోసం లక్డికాపూల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది.