
జడివాననో గణయాత్ర
భక్తుల జయజయధ్వానాల మధ్యగణ..గణమంటూ గణనాథులు నిమజ్జనానికి కదిలారు. జడివానలోనూ భక్తుల ఉత్సాహం హోరెత్తింది. వాన కారణంగా శోభాయాత్రకు ఆటంకం కలిగింది. డప్పుల దరువులు, యువత కేరింతలతో యాత్ర ఆద్యంతం శోభిల్లింది. అటు ట్యాంక్‌బండ్, ఇటు ఎంజే మార్కెట్.. ఎటు చూసినా భక్తజన సందోహపు సందడే. ఇక, లంబోదరుని లడ్డూలు లక్షలు పలికాయి. వేలం పాటలో భక్తులు రికార్డు స్థాయి ధరకు వీటిని దక్కించుకున్నారు.
కవాడిగూడ, న్యూస్‌లైన్: భాగ్యనగరం భక్తిభావంతో తడిసిముద్దయ్యింది. గణేష్ నామస్మరణతో పులకించింది. బొజ్జగణపయ్య నిమజ్జనోత్సవం బుధవారం ట్యాంక్‌బండ్‌పై వేలాది భక్తజనుల మధ్య కోలాహలంగా, అత్యంతవైభవంగా జరిగింది. గణేష్ విగ్రహాలను క్రేన్ల సహాయంతో హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తుండగా భక్తులు అత్యంత ఆసక్తిగా తిలకించారు. వివిధ ప్రభుత్వ శాఖలు విరివిగా సేవలందించాయి. ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనోత్సవ విశేషాలసమాహారం...
వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ట్యాంక్‌బండ్ జాతరను తలపించింది.
ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు నిమజ్జనం చేసేందుకు నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో క్రేన్లను ఏర్పాటు చేశారు.
నిమజ్జనానికి తరలి వచ్చే విగ్రహాల లెక్కింపు కార్యక్రమంలో పోలీసులు, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్, రాణిగంజ్ వైపు నుంచి వచ్చే వాహనాలను, రాణిగంజ్ వైపు వెళ్లే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా నిలిపివేశారు.
విద్యుత్ శాఖ ఇందిరా పార్కు కార్యాలయం ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై విద్యుత్ క్యాంపు ఆఫీసును ఏర్పాటు చేసింది.
భక్తుల కోసం జలమండలి ఆధ్వర్యంలో తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు.
సిటీ పోలీసు ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
జీహెచ్‌ఎంసీ ఏర్పాటుచేసిన కార్యాలయంలో ప్రభుత్వ వైద్యులు వైద్య శిబిరం నిర్వహించారు.
కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
తప్పిపోయిన పిల్లల కోసం బాలల పరిరక్షణ విభాగం, హైదరాబాద్ జిల్లా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిస్సింగ్ చిల్డ్రన్స్ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు.
పోలీసు శాఖ ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు.
పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ట్యాంక్‌బండ్ అటు నుంచి ఇటువరకు మొత్తం కలియదిరిగి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షణ చేశారు.