
టెక్నాలజీతో చైన్‌స్నాచర్లకు చెక్!
సాక్షి, సిటీబ్యూరో: జంట పోలీసు కమిషనరేట్లలో చైన్ స్నాచర్లను కట్టడి చేసేందుకు సైబరాబాద్ పోలీసులు సరికొత్త పంథాతో ముందుకెళ్తున్నారు. వేగంగా బండి నడుపుతూ స్నాచింగ్ చేసి.. రెప్ప పాటులో మాయమవుతున్న గొలుసుదొంగలను పట్టుకునేందుకు ఇప్పటికే 55 మోటారు సైకిల్ టీమ్‌లను రంగంలోకి దింపగా.. మరోవైపు టెక్నాలజీతోనూ వారి ఆట కట్టించేందుకు దేశంలోనే తొలిసారిగా ‘యాంటీ చైన్ స్నాచింగ్ స్ట్రాటజీ’ని అమలు చేస్తున్నారు.
టీమ్ వర్క్...
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కరుడుగట్టిన దొంగల ముఠాలు జంట కమిషనరేట్లలోని పలు ప్రాంతాలపై దృష్టి పెట్టడంతో వాటిని ధీటుగా ఎదుర్కోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. ఇటీవల స్నాచింగ్‌లు హింసాత్మకంగా మారడంతో దొంగల వ్యూహాలను తిప్పికొట్టేందుకు రంగం సిద్ధం చేశారు. పోలీసు సిబ్బందిని సుశిక్షితం చేయడం దగ్గరి నుంచి నేరస్థుడి సమాచారాన్ని క్రోడీకరించడం వరకు కమిషనర్ ఆనంద్ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు.
సీపీ పర్యవేక్షణలోనే యాంటీ చైన్ స్నాచింగ్ సెల్ బాధ్యతలను క్రైమ్స్ డీసీపీ నవీన్, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ సాయిమనోహర్ చూసుకుంటున్నారు. నేరగాళ్ల సెల్‌ఫోన్ ద్వారా వారి వివరాలు పసిగట్టే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎస్‌ఓటీ ఓఎస్‌డీ రాంచంద్రారెడ్డికి అప్పగించారు. ఈయన సారథ్యంలో ఏడుగురు సభ్యులతో కూడిన టీమ్ కాల్ డేటా వివరాలను సేకరించి, సిగ్నల్స్ ఆధారంగా నిందితులు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకుంటున్నారు. కేసు దర్యాప్తు క్రమంలో ఈ డేటా చాలా కీలకం కానుంది.
వందల సంఖ్యలో డేటా సేకరణ...
ఎస్‌ఓటీ, సీసీఎస్, సీసీఆర్‌బీ, ఐటీ సెల్‌ల నుంచి సభ్యులతో ఈస్ట్, వెస్ట్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశారు. టెక్నికల్ అనాలసిస్, డేటా కలెక్షన్, మ్యాపింగ్, ట్రాకింగ్ పనిని వేగవంతం చేశాయి. ఇవి వం దల సంఖ్యలో నిందితుల డేటా సేకరించినట్టు తెలుస్తోంది. అలాగే ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల లా అండ్ ఆర్డర్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ డేటా కలెక్షన్ చేస్తున్నారు.
నిందితుల ఫొటో కలెక్షన్, సీసీటీవీ ఫుటేజీ కలెక్షన్, ఎక్కడెక్కడ కేసులు పెండింగ్ ఉన్నాయనే వివరాలను సేకరిస్తున్నారు. చైన్ స్నాచింగ్‌లు ఎక్కువగానే జరుగుతున్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతోనూ సమన్వయం సాధించే దిశగా ప్రయత్నిస్తున్నారు. వీరి నుంచి స్నాచర్ల డాటా తెప్పిస్తే దాదాపు 70 శాతం వరకు స్నాచర్ల వివరాలు సేకరించినట్టు అవుతుంది.
యాంటీ సెల్ పసిగట్టింది...
భోపాల్‌లో కొంత మంది చైన్ స్నాచర్లను అక్కడి పోలీసులు పట్టుకున్నారు. అయితే యాంటీ చైన్ స్నాచింగ్ సెల్ ద్వారా అక్కడి నుంచి చైన్ స్నాచర్ల సమాచారాన్ని తెప్పించాం. వారు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలో దాదాపు 20కి పైగా చైన్‌స్నాచింగ్‌లు చేసినట్టు గుర్తించాం. ఇప్పటికే సైబరాబాద్ పోలీసు టీమ్‌ను భోపాల్‌కు పంపించాం. పీటీ వారంట్ వేశాం. త్వరలోనే ఆ నిందితులను నగరానికి తీసుకొచ్చి మరిన్ని వివరాలు రాబడతాం.
-నవీన్, క్రైమ్స్ డీసీపీ, సైబరాబాద్