
నేడు ఈద్–ఉల్– జుహా
సాక్షి, సిటీబ్యూరో: త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈద్–ఉల్–జుహా (బక్రీద్) ప్రార్థనల కోసం మహా నగరంలో ఈద్గాలు, మసీదులు ముస్తాబయ్యాయి. చారితక ఈద్గా మీరాలం, మాదన్నపేట ఈద్గా ఖదీమ్, గోల్కొండ, శేరిలింగంపల్లి, మక్కా మసీదు, నాంపల్లిలోని షాహీ మస్జీద్ బాగేమాలతో పాటు సుమారు 120 మసీదులు ముస్తాబయ్యాయి. ఈద్ ప్రార్థనల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మాదన్నపేట ఈద్గాలో 9గంటలకు..
మాదన్నపేటలోని ఈద్గా ఖదీమ్‌లో ఉదయం 9 గంటలకు ఈద్–ఉల్–జుహా ప్రార్థనలు జరుగనున్నాయి. ఉదయం సదాత్ పీర్ మౌలానా సయ్యద్ మహ్మద్ హుస్సేన్ బగ్దాది ఆధ్యాత్మిక ప్రసంగం అనంతరం మౌలానా ఖరీ సయ్యద్ మొహ్మద్ యూసుఫ్ మదాని ఈద్–ఉల్–జుహాæనమాజ్ చదివిస్తారు. నగరంలోని వివిధ మసీదుల్లో ఉదయం 8 నుంచి 10.30 గంటల వరకు ప్రార్థనలు చేస్తారు.
మీరాలంలో ఉదయం 9.30 గంటలకు...
నగరంలోని ప్రసిద్ధ మీరాలం ఈద్గాలో మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఈద్–ఉల్–జుహాæ ప్రార్థనలు జరుగనున్నాయి. ఉదయం జామే నిజామియాకు చెందిన మౌలానా షఫీయుల్లా షేక్ ఉల్ ఆదాబ్, హైదరాబాద్ దారుల్ ఉలూమ్‌కు చెందిన మౌలానా జాఫర్ పాషా ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తారు. అనంతరం మౌలానా హఫీజ్ రిజ్వాన్ ఖురేషీ ఈద్ నమాజ్ చదివిస్తారు.
బక్రీద్ సందర్భంగా జీçహెచ్‌ఎంసీ ఏర్పాట్లు
బక్రీద్ సందర్భంగా జీహెచ్‌ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మీరాలం ఈద్గా, మక్కా మసీదు వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టింది. మసీదుల వద్ద ఖుర్బానీ వ్యర్థాల కోసం కవర్లు పంపిణీ చేయనుంది. వాటిని సేకరించేందుకు వాహనాలను ఏర్పాటు చేసింది. పోలీసు శాఖ సమన్వయంతో చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.