అసద్‌ను అరెస్టు చేయాలి | tpcc leaders demands asaduddin owaisi arrest | Sakshi
Sakshi News home page

అసద్‌ను అరెస్టు చేయాలి

Published Wed, Feb 3 2016 2:45 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM

మంగళవారం డీజీపీ కార్యాలయం ఎదుట బైఠాయించిన ఉత్తమ్, దానం, అంజన్, పొన్నం తదితరులు

మంగళవారం డీజీపీ కార్యాలయం ఎదుట బైఠాయించిన ఉత్తమ్, దానం, అంజన్, పొన్నం తదితరులు

కాంగ్రెస్ డిమాండ్.. గాంధీభవన్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు ర్యాలీ
డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా
 
 సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శాసన మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీపై దాడి చేసిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ డీజీపీ కార్యాలయం ఎదుట టీపీసీసీ ధర్నాకు దిగింది. గాంధీభవన్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు టీపీసీసీ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాదయాత్రతో ర్యాలీని నిర్వహించారు. మంగళవారం పాతబస్తీలో ఉత్తమ్, షబ్బీర్‌పై దాడి నేపథ్యంలో ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్, రామ్మోహన్‌రెడ్డి తదితరులు గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
 
 దాడికి దిగిన అసదుద్దీన్ ఒవైసీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పాదయాత్రగా గాంధీభవన్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎంఐఎంకు, పోలీసులకు వ్యతిరేకంగా  కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ ర్యాలీకి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, అంజన్‌కుమార్ యాదవ్, దానం నాగేందర్ తదితరులు నేతృత్వం వహించారు. ర్యాలీ నాంపల్లి, పబ్లిక్ గార్డెన్స్, అసెంబ్లీ మీదుగా డీజీపీ కార్యాలయానికి చేరుకుంది. ఈలోగా ఉత్తమ్, షబ్బీర్ అలీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నేరుగా డీజీపీ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
 
కాసేపటి తర్వాత రోడ్డుపై ధర్నా చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ తదితర ముఖ్య నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. నగర పోలీసు సంయుక్త కమిషనర్ అంజన్‌కుమార్ టీపీసీసీ నేతలతో చర్చించారు.
 
ఉత్తమ్‌కుమార్, షబ్బీర్ అలీపై దాడిచేసినవారిపై 24 గంటల్లోగా చర్యలు తీసుకుంటామని ఆయన డీజీపీ తరపున హామీ ఇచ్చారు. దీంతో టీపీసీసీ ధర్నాను విరమించింది.
 
ఇది ప్రజాస్వామ్యమేనా?: జానా
పాతబస్తీలో భయోత్పాత వాతావర ణం సృష్టించి రిగ్గింగ్ చేసేందుకు ఎంఐఎం కుట్ర పన్నిందని ప్రతిపక్ష నేత జానారెడ్డి ఆరోపించారు. పురానాపూల్ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని పోలింగ్ పర్యవేక్షించకుండా పోలీసులు నిర్బంధించడం ఎలా సమంజసమని ప్రశ్నించారు. దీనిపై స్పందించి పాతబస్తీకి వెళ్లిన ఉత్తమ్, షబ్బీర్ అలీపై ఎంఐఎం నేతలు దాడులకు దిగడం దారుణమన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అంటూ జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ రోజున ఎంఐఎం బైక్ ర్యాలీకి అనుమతి ఎక్కడిదని ప్రశ్నించారు. దాడులు జరుగుతుంటే పోలీసులు చోద్యం చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఎన్నికలు నిర్వహించడం కంటే నామినేట్ చేసుకుంటే సరిపోయేదన్నారు. పురానాపూల్, మీర్‌చౌక్‌తోపాటు పాతబస్తీలోని 44 డివిజన్లలో రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
 
ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు: భట్టి
ఎంఐఎం నేతల ఆగడాలు మితిమీరిపోయినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకోబోమని, తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
 
రాష్ట్రవ్యాప్తపోరాటం: ఉత్తమ్, షబ్బీర్
తమపై దాడికి దిగిన ఎంఐఎం నేతలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని  ఉత్తమ్‌కుమార్ రెడ్డి,  షబ్బీర్ అలీ హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement