బిస్లరీ వాటర్ బాటిళ్లనే అమ్మాలంటున్నారు
ఆర్టీసీ సర్క్యులర్‌పై హైకోర్టును ఆశ్రయించిన వ్యాపారులు
సాక్షి, హైదరాబాద్: బస్టాండ్లలో బిస్లరీ వాటర్ బాటిళ్లనే అమ్మాలని ఆర్టీసీ అధికారులు జారీ చేసిన సర్క్యులర్‌పై పలువురు వ్యాపారులు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. తమ వ్యాపారంలో జోక్యం చేసుకోకుండా వారిని ఆదేశించాలని డి.జాహెద్ బాషా, మరో 19 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సి.రామచంద్రరాజు వాదనలు వినిపిస్తూ.. బస్టాండ్లలో బిస్లరీ వాటర్ బాటిళ్లనే అమ్మాలని, ఒకే పంపిణీదారు నుంచి వాటిని కొనుగోలు చేయాలని ఆర్టీసీ అధికారులు గత డిసెంబర్ 9న సర్క్యులర్ జారీ చేశారని చెప్పారు.
దీంతో సాధారణం కన్నా ఎక్కువ ధరకు బాటిళ్లను వ్యాపారులు కొనుగోలు చేయాల్సి వస్తోందని వివరించారు. ఇతర కంపెనీల బాటిళ్లను విక్రయించొద్దని కూడా ఆదేశాలు జారీ చేశారని, అధికారుల నిర్ణయం వల్ల పిటిషనర్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. అన్ని కంపెనీల వాటర్ బాటిళ్లనూ విక్రయించేందుకు అనుమతినిచ్చేలా అధికారులను ఆదేశించాలని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.