హైదరాబాద్‌లో మూడ్రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
► ఉప రాష్ట్రపతి వెంకయ్య పర్యటన నేపథ్యంలో
సాక్షి, హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం నుంచి మూడు రోజుల పాటు నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయా తేదీలు, సమయాల్లో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కమిషనర్ మహేంద ర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఉదయం 9.00 నుంచి 10.15 గంటల వరకు బేగంపేట విమానాశ్రయం–విద్యానగర్ మధ్య, 10.45 నుంచి 11.30 గంటల వరకు విద్యా నగర్–ఉప్పల్ ఇండస్ట్రియల్ పార్క్ మధ్య, మధ్యాహ్నం 12.00 నుంచి 1.15 గంటల వరకు ఉప్పల్ ఇండస్ట్రియల్ పార్క్–రాజ్‌భవన్ మధ్య, సాయంత్రం 4.45 నుంచి 5.30 గంటల వరకు రాజ్‌భవన్–బంజారాహిల్స్ రోడ్ నెం.12 మధ్య మార్గాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయి.
ఆది, సోమవారాల్లో ఇలా..
ఆదివారం ఉదయం 9.45 నుంచి 10.30 గంటల వరకు బంజారాహిల్స్ రోడ్ నెం.12–బేగంపేట ఎయిర్ పోర్ట్ మధ్య, సాయంత్రం 4.30 నుంచి 5.15 గంటల వరకు బంజారాహిల్స్ రోడ్ నెం.12–శిల్పకళా వేదిక మధ్య, సాయంత్రం 5.45 నుంచి 6.30 గంటల వరకు శిల్పకళా వేదిక–బంజారాహిల్స్ రోడ్ నెం.12 మధ్య మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తారు. సోమవారం ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకు బంజారాహిల్స్ రోడ్ నెం.12–బేగంపేట విమానాశ్రయం మధ్యలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వీటిని దృష్టిలో పెట్టుకుని వాహనచోదకులు సహకరించాలని పోలీసులు కోరారు.