
చీకట్లు నింపిన హోలీ
⇒ చెరువులు, కాలువల్లో మునిగి 11 మంది మృత్యువాత
⇒ మరో తొమ్మిది మంది గల్లంతు
⇒ మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులే..
సాక్షి నెట్‌వర్క్: సంబరాలు పంచాల్సిన హోలీ పండుగ ఆ కుటుంబాల్లో చీకట్లు నింపింది. ఆదివారం వివిధ జిల్లాల్లో స్నేహితులతో కలసి సంతోషంగా హోలీ ఆడి చెరువులు, కాలువల్లోకి స్నానాలకు వెళ్లి 11 మంది మృత్యువాత పడ్డారు. మరో తొమ్మిది మంది గల్లంతయ్యారు. నల్లగొండ, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నిర్మల్, వనపర్తి, జనగామ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. పండగపూట తమవారిని పొగొట్టుకొన్న కుటుంబాలు కన్నీరుమున్నీ రయ్యాయి.
ఎక్కువ మంది యువకులు, విద్యార్థులే..
భద్రాచలం పట్టణానికి చెందిన మోరుపూడి రాంప్రసాద్(19), బోటా రమేశ్(19) స్నేహితులతో హోలీ ఆడి గోదావరిలోకి స్నానానికి వెళ్లారు. నీటి ఉధృతికి వారిలో ఐదుగురు కొట్టుకుపోతుండగా.. అక్కడున్న గజ ఈతగాళ్లు ముగ్గుర్ని రక్షించారు. రాంప్రసాద్, రమేశ్ నీటిలో కొట్టుకుపోయి చనిపోయారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని వివేకానందనగర్‌కు చెందిన ఇంటర్ చదివే విద్యార్థి శివరాం(13) ఉదయసముద్రం చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లి నీటమునిగి మృత్యువాత పడ్డాడు. నల్లగొండలోని సతీశ్‌నగర్‌కు చెందిన కృష్ణ కుమార్ (27) పట్టణ శివారులోని ఉదయసముద్రం చెరువులో జారిపడి చనిపోయాడు.
రంగారెడ్డి జిల్లా బోరబండ పరిధిలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన పవన్‌కుమార్‌రెడ్డి(16), గణేశ్(15) స్నేహితులతో కలసి మొయినాబాద్‌లోని గండిపేట చెరువుకు స్నానానికి వెళ్లి నీటమునిగారు. వీరిలో పవన్‌కుమార్‌రెడ్డి మృతదేహం లభ్యమైంది. గణేశ్ కోసం గాలిస్తున్నారు. ఇదే జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని పొల్కంపల్లి గ్రామంలో పల్లోల నాగరాజు (23) స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి చనిపోయాడు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామాపూర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి సాయికుమార్(17) ఎస్సారెస్పీ కాలువలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. రాత్రి వరకు గాలించినా దొరకలేదు.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం అనంతసాగర్‌కు చెందిన తుంకి శ్రీనివాసరెడ్డి(24) గ్రామ శివారులోని చెరువులో మునిగి గల్లంతయ్యాడు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థి బైరి మహేశ్(15) హోలీ ఆడి సాయంత్రం స్నానానికి వాగులోకి వెళ్లి నీటిలో మునిగి చనిపోయాడు. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన ఎం.శివకుమార్‌చారి స్నేహితులతో కలసి సరళాసాగర్ ప్రాజెక్టు చూసేందుకు వెళ్లి తిరిగి వస్తూ బైక్ అదుపు తప్పి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఫతేపురానికి చెందిన ఐటీఐ విద్యార్థి నరేశ్(21) చెరువులోకి ఈతకు వెళ్లి చనిపోయాడు.
జనగామలోని గణేశ్‌నగర్‌కు చెందిన క్రాంతికుమార్(19), నాగరాజు(10) నర్మెట మండలంలోని బొమ్మకూరు రిజర్వాయర్‌లో గల్లంతయ్యారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో బైరి వీరేష్(9), నర్ర చరణ్(10) హోలీ వేడుకల తర్వాత ఊరి పక్కనే ఉన్న చెరువు వద్దకు స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణం ఠాగూర్‌నగర్‌కు చెందిన వెంకటేశ్ అమరవాది చెరువుకు స్నానానికి వెళ్లి అందులో గల్లంతయ్యాడు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం అన్నారానికి చెందిన పొట్టాల సంపత్ (36) కాకతీయ కాలువలో మునిగి చనిపోయాడు. ఇదే జిల్లా హుజురాబాద్ మండలం కందుగులకు చెందిన పదో తరగతి విద్యార్థి రాజశేఖర్ ఎస్సారెస్పీ కాలువలో ఈతకు వెళ్లి నీటిలో కొట్టుకుపోయాడు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బాచన్‌పల్లికి చెందిన కనక బబ్లూ(17) హోలీ తర్వాత స్నానానికి చెరువుకు వెళ్లి బురదలో కూరుకుపోయి చనిపోయాడు.
రంగు నీళ్లనుకొని.. కిరోసిన్ చల్లి..
రంగు నీళ్లు అనుకొని కిరోసిన్ చల్లడంతో మంటలు అంటుకొని బీటెక్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ మండలం దేవుని చెరువుతండాకు చెందిన జర్పుల చందూనాయక్(24) చంపాపేట సమీపంలోని సింగరేణి గుడిసెల్లో సోదరుడి ఇంట్లో ఉంటున్నాడు. ఆదివారం స్నేహితులతో హోలీ ఆడుతుండగా.. పక్కనే ఉండే ఓ యువతి చందూనాయక్ తలపై గుడ్డు కొట్టింది. దీంతో రంగు చల్లేందుకు వెళ్తుండగా.. ఆమె పక్కనే డబ్బాలో కిరోసిన్‌ను రంగునీళ్లు అనుకొని చందూనాయక్‌పై చల్లింది. తప్పించుకునే ప్రయత్నంలో చందూ పక్కన ఉన్న కట్టెల పొయ్యి వద్ద పడ్డాడు. దీంతో మంటలంటుకున్నాయి. 75 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.