పాపం... సానియా..
- రోజంతా కోర్టుల్లో హైడ్రామా
- తల్లిదండ్రులకు దూరమై ఒంటరైన చిన్నారి
సాక్షి, హైదరాబాద్ : నాన్న చేతిలో కాలి బూడిదైన అమ్మ... ఆ హత్యానేరంతో జైలుకెళ్లిన నాన్న... తమకే కావాలని తల్లి వైపు... తండ్రి వైపు బంధువులు పటబట్టడంతో... ఎవరికీకాక ఒంటరైన బుజ్జితల్లి కంటనీరు కట్టలు తెగుతోంది. ఎనిమిదేళ్ల చిన్నారి సానియా శుక్రవారమంతా కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. గచ్జిబౌలిలో ఉండే రూపేశ్‌కుమార్ తన భార్య సింథియాను గత ఆదివారం హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరి ఏకైక కుమార్తె సానియా(8) పరిస్థితి దైన్యంగా మారింది. చిన్నారిని తామే పెంచుతామని నానమ్మ లలిత చెబుతుండగా, తమదేశం కాంగోకు తీసుకెళ్తామంటూ మేనమామ పట్టుబడుతున్నారు. కాంగో రాయబారి కూడా సానియాను తమకు అప్పగించాలని కోరినట్లు తెలిసింది.
కనిపించని బంధువులు...
ఈ వివాదంతో నింబోలిఅడ్డాలోని రెస్క్యూ హోంలో ఉన్న సానియాను ఎవరికి అప్పచెప్పాలో తేల్చుకోని పోలీస్‌లు తొలుత రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలోని 8ఎంఎం కోర్టు న్యాయమూర్తి రాధిక జేస్వాల్ ఎదుట హాజరుపరిచారు. ఈ కేసు తమ పరిధిలోకి రాదని ఎల్బీనగర్‌లోని రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ కోర్టుకు న్యాయమూర్తి బదిలీ చేశారు. సానియాను అక్కడికి తీసుకువెళ్లగా... తమ పరిధిలో లేదని ఫ్యామిలీ కోర్టు జడ్జి రమేష్‌బాబు వెల్లడించారు. దీంతో మళ్లీ రాజేంద్రనగర్ 8ఎంఎం కోర్టుకు తీసుకెళ్లగా... పొద్దుపోయే వరకు విచారణ కొనసాగింది. అయితే... సానియా మాక్కావాలంటే మాక్కావాలన్న బంధువులు ఒక్కరు కూడా కోర్టులో పిటిషన్ వేయలేదు. దీంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు చిన్నారిని హైదర్షాకోటలోని కస్తూర్బా ట్రస్ట్‌కు తరలించారు. సోమవారం వరకు అక్కడే చిన్నారి యోగక్షేమాలు చూసుకోవాలన్నారు. బంధువులు పిటిషన్ దాఖలు చేస్తే తిరిగి ఈ కేసుపై విచారణ జరుగుతుంది.