సెల్యూట్లు... సైరన్లే మిగిలాయి
అధికార టీఆర్‌ఎస్ నేతల పరిస్థితి కక్కలేక... మింగలేక అన్నట్లు తయారైంది. నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూసీ చూసీ విసిగిపోయిన వీరు నాయకత్వం తీరుపై జోకులు వేసుకుంటున్నారు. ఒకట్రెండు కార్పొరేషన్లు, శుక్రవారం ఓ పది మార్కెట్ కమిటీలకు చైర్మన్లు మినహా నామినేటెడ్ పదవుల పందేరం జరగలేదు. ఒక విధంగా ఇది వారి కడుపు మంటే అయినా, బహిరంగంగా మాత్రం వ్యాఖ్యానించలేకపోతున్నారు.
పార్టీ ఆవిర్భావం నుంచి గడిచిన పదిహేనేళ్లుగా కొనసాగుతున్న వారిలో చాలా మందికి ఇంకా ఎలాంటి పదవీ యోగం పట్టలేదు.
పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నా... రాజకీయ నిరుద్యోగంతో ఉడికిపోతున్న కొందరు నాయకులు తమకి తాము సర్ది చెప్పుకుంటున్నారు. మరోవైపు ఏ చిన్న పనికూడా కావడం లేదని, తమ వద్దకు పనుల కోసం వచ్చే కార్యకర్తలకు ఏం చెప్పాలో పాలుపోవడం లేదంటూ వాపోతున్నారు.
చివరకు ఎమ్మెల్యేలు, మంత్రులకే ఏమీ నడవడం లేదట కదా అని సెటైర్లు పేలుస్తున్నారు. ‘మా నాయకునికి ఇష్టమున్నట్టులేదు. ఉంటే గింటే ఈ పాటికే మాకు పదవులు రాకపోవునా.. అయినా ఆశగా ఎదురుచూడడం తప్ప ఇప్పుడేం చేయలేం. టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి మా పార్టీలోకి వచ్చిన వాళ్లు మాత్రం ఏమన్నా సంతోషంగా ఉన్నారా..? మంత్రులు కూడా మాకు ఏం చేయలేకపోతున్నారు. అయినా... వారికి కూడా సెల్యూట్లు.. సైరన్లే మిగిలాయి..’ అని ఓ నేత వ్యాఖ్యానించారు. పార్టీ నేతల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి గురించి ఎవరూ ఆలోచించడం లేదని పదవులు రాని నేతలంతా గొణుక్కుంటున్నారు..!!