
ధర్నాచౌక్ హింసకు ‘లెఫ్ట్’దే బాధ్యత
టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ప్రజలు, పోలీసులపై దాడులు చేసి సృష్టించిన హింసాకాండకు కమ్యూనిస్టులే బాధ్యత వహించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే దుర్బుద్ధితో ప్రతిపక్షాలు, ముఖ్యంగా కమ్యూనిస్టులు పథకం ప్రకారం సృష్టించిన అరాచకాన్ని టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ముందస్తుగానే ధర్నాచౌక్ హింసాకాండకు రూపకల్పన జరిగిందని కర్నె ఆరోపించారు. ధర్నాచౌక్‌ను అక్కడి నుంచి తొలగించాలని కానీ, అక్కడే కొనసాగించాలని కాని ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశం కోర్టులో ఉందని తెలిపారు.
ధర్నాచౌక్ వల్ల తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని, దానిని అక్కడి నుంచి తరలించాలని చుట్టుపక్కల బస్తీల ప్రజలు కోరుతున్నారని, కొందరు కోర్టులో పిటిషన్ కూడా వేశారని కర్నె వివరించారు. అసలు ధర్నాలు చేయాల్సిన అవసరమే రాకుండా ప్రభుత్వం మంచి పనులు చేసుకుంటూ పోతోందని అన్నారు. ఆందోళనకు మద్దతు ఇచ్చిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి, టీజేఏసీ చైర్మన్ కోదండరాం ప్రజలకు క్షమాపణలు, ఈ సంఘటనకు కారణమైనవారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు.