తెలంగాణను కాంగ్రెస్ నాశనం చేసింది
టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని 42 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ తెలంగాణను సర్వనాశనం చేసిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. జూన్ 1వ తేదీన సంగారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ సభలో కాంగ్రెస్ టీఆర్ ఎస్‌పై చార్జీషీట్ పెడతాననడంపై ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘టీఆర్‌ఎస్‌పై ఏమని చార్జిషీట్ పెడతారు? కాంగ్రెస్ తమ పాలనలో జరిగిన అన్యాయాలపై చార్జిషీట్ వేస్తుందా? అమిత్ షా టూర్ తో బీజేపీ నేతలు అభాసు పాలయినట్టే కాంగ్రెస్ కూడా రాహుల్ టూర్ తర్వాత అభాసు పాలు కాక తప్పదు? కాంగ్రెస్ పదేళ్ల పాలన అక్రమాలను తెలంగాణ ప్రజలు మరిచి పోలేదు. రాహుల్ కు కాంగ్రెస్ నేతలు అబద్దాలు చెప్పి తప్పుదోవ పట్టించొద్దు..’అని కర్నె పేర్కొన్నారు.
పదేళ్ల కాంగ్రెస్ పాలనలో మహబూబ్‌నగర్ నుంచి వలసలు ఉండేవని, ఇపుడు వలసలు వాపస్ వచ్చినందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై చార్జి షీట్ వేస్తారా అని నిలదీశారు. టీడీపీతో పొత్తు గురించి మాట్లాడిన జైపాల్‌రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నందుకు ఆ పార్టీ నేతలు సిగ్గు పడాలని అన్నారు. తమ సర్వేలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోతారని తేలిం దని.. అది తప్పని ఉత్తమ్ నమ్మితే హుజూర్ నగర్ నుంచి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు.