'పునరేకీకరణ' తంత్రం
ప్రత్యేక తెలంగాణ సాధనే ఎజెండాగా పద్నాలుగేళ్లు ఉద్యమించిన టీఆర్‌ఎస్..
మూడేళ్ల పాలనలో అధికార టీఆర్‌ఎస్ కొత్త పంథా
- తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీలో చేరాలనుకునే నేతలకు ఎర్ర తివాచీ
- అసెంబ్లీలో 63 నుంచి 90కి పెరిగిన పార్టీ సంఖ్యాబలం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ సాధనే ఎజెండాగా పద్నాలుగేళ్లు ఉద్యమించిన టీఆర్‌ఎస్.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 63 స్థానాలను గెల్చుకొని అధికారం చేపట్టింది. ‘బంగారు తెలంగాణ’ దిశగా ప్రణాళికలు రచించింది. రాజకీయ సుస్థిరత ఉంటే తప్ప అభివృద్ధి సాధ్యంకాదన్న ఆలోచనలతో రాజకీయ పునరేకీకరణ పేరిట ‘ఆపరేషన్ ఆకర్ష్’కు శ్రీకారం చుట్టింది. తెలంగాణ అభివృద్ధి కోసం వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి రావాలనుకునే వారికి ఎర్ర తివాచీ పరిచింది. దీంతో మూడేళ్లు నిండే సరికి అసెంబ్లీలో టీఆర్‌ఎస్ బలం 63 నుంచి 90కి చేరింది.
అయితే కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన ఏడుగురు ఎమ్మెల్యేలను అధికారిక లెక్కల్లో చూపకుండా 83 మంది సభ్యులను చూపుతున్నారు. వీరు కాకుండా టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీల నుంచి ముగ్గురు ఎంపీలు సైతం టీఆర్‌ఎస్‌లో చేరారు. తద్వారా పార్లమెంటులో టీఆర్‌ఎస్ బలం 11 నుంచి 14కి చేరింది. మరోవైపు ఎమ్మెల్యేల సంఖ్య పెరగడం వల్ల ఒక రాజ్యసభ సీటును దక్కించుకోవడంతో రాజ్యసభలో సంఖ్య ఇద్దరికి చేరింది. ‘పద్నాలుగేళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో టీఆర్‌ఎస్ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. కుట్రలను చూసింది.. వెన్నుపోట్లను తట్టుకుంది.
అధికారం చేపట్టాక కూడా తెలంగాణను ఓ విఫల ప్రయత్నంగా చూపేందుకు, ప్రభుత్వాన్ని అస్థిరతపాలు చేసేందుకు కుట్రలు చేశారు. అందుకే రాజకీ య సుస్థిరత కోసం, రాజకీయ పునరేకీకరణకు నడుం బిగించి విజయం సాధించాం..’ అని అధికార పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ కారణంగానే మూడేళ్లలో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ తదితర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలకు టీఆర్‌ఎస్ గులాబీ కండువాలు కప్పింది.
సభ్యత్వ నమోదులో రికార్డు...
మూడేళ్ల కిందట అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. రెండేళ్లకోమారు జరిగే పార్టీ సభ్యత్వ నమోదు ద్వారా కొత్త రికార్డును సృష్టించింది. మొదట 50 లక్షల మార్కును దాటిన టీఆర్‌ఎస్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్లీనరీ జరిగే నాటికి ఏకంగా 75 లక్షల సభ్యత్వాన్ని నమోదు చేసింది. దీనిద్వారా దేశంలో ఒక పెద్ద పార్టీగా అవతరించామని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయపరుచుకుంటూ పాలన సాగించాల న్న సీఎం... పార్టీ నాయకత్వాన్ని కూడా ప్రభుత్వంలో భాగస్వాములను చేయగలిగారు. రెండేళ్ల పాలన పూర్తయ్యే వరకు ఏ కొందిరికో తప్ప దక్కని ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, మూడో ఏడాది పూర్తికావొచ్చేసరికి అత్యధికులకు లభించాయి.
మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా ఉన్న రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడంతో ప్రభుత్వ ప్రచారకులను భారీగా పెంచుకుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీఆర్‌ఎస్ ఇప్పటివరకు మూడు ప్లీనరీలు నిర్వహించింది. పార్టీ ప్లీనరీలను సైతం ప్రభుత్వ పథకాల ప్రచారానికి వేదికగా వినియోగించుకుంది. ఏప్రిల్‌లో ముగిసిన 16వ ప్లీనరీకి భారీ జనసమీకరణతో బలప్రదర్శన చేసింది. ఈ వేదికను మూడేళ్ల పాలన విజయాలను చెప్పుకునేందుకు వినియోగించుకుంది.
వలస నేతలకూ గుర్తింపు
రాజకీయ పునరేకీకరణలో భాగంగా వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించిన నేతలకూ గుర్తింపు ఇవ్వడం ద్వారా మరిన్ని వలసలను ప్రోత్సహించేందుకు అధికార పార్టీ వ్యూహ రచన చేసింది. టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర్‌రావులకు మంత్రివర్గంలో స్థానం కల్పించింది. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉండి టీఆర్‌ఎస్‌లో చేరిన గుండు సుధారాణికి కార్పొరేషన్ పదవితోపాటు పార్టీ మహిళా విభాగం పగ్గాలూ అందించింది. కాంగ్రెస్, టీడీపీల నుంచి ఎమ్మెల్సీలుగా ఉండి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు వంటి వారికి తిరిగి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వడమే కాకుండా నేతికి మండలి డిప్యూటీ చైర్మన్, బోడకుంటికి మండలిలో ప్రభుత్వ విప్ పదవులు ఇచ్చింది.