
'పార్టీని వదులుకోవడానికి సిద్ధంగా లేను'
హైదరాబాద్ : తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. నాయకులు పోయినా పార్టీ మాత్రం పోదని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీని వదులుకోవడానికి తాను సిద్ధంగా లేనని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయామన్నారు.
పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి... అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్నామని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒకరిద్దరు పోయినంత మాత్రన పార్టీకీ ఏమాత్రం నష్టం ఉందన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటేనే నాయకత్వం ఎదుగుతోందన్నారు. జరుగుతున్న పరిణామాలకు భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు తెలిపారు. సంక్షోభాలను ధైర్యంగా ఎదుర్కొనే పార్టీ టీడీపీ ఒక్కటే అని చెప్పారు. టీడీపీకి కార్యకర్తలే బలమని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.