
బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు తెలంగాణలో క్యాంపు ఏర్పాటు చేసుకోవడంపై టీఆర్‌ఎస్ ఎంపీ బాల్కసుమన్ మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దొంగల ముఠాను ఏర్పాటు చేసి తెలంగాణకు పంపారని ఆరోపించారు. శనివారం ఆయన సీనియర్ నేత గట్టు రామచంద్రరావుతో కలిసి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. అక్రమ సంపాదనను తెలంగాణలో ఖర్చుపెట్టి తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ నడుస్తోందని, దీనిపై గవర్నర్, డీజీపీలకు ఫిర్యాదు చేస్తామన్నారు.
వారు స్పందించకపోతే టీఆర్‌ఎస్ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలే వెంటపడి తరిమేలా ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. ఇన్నాళ్లు చంద్రబాబుపై కేసులు వేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చంద్రబాబు చేతులు పట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఏజేంట్లు కొంత మంది కాంగ్రెస్‌లో ఉన్నారన్నారు. చంద్రబాబు కుట్రలకి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలన్నారు. చంద్రబాబు చేసిన ఆక్రమాలకు నాలుగైదు సార్లు జీవిత ఖైదు శిక్ష వేసినా సరిపోదన్నారు. ఎన్టీఆర్ కుటుంబం చంద్రబాబును టీడీపీ నుంచి తరిమేయాలన్నారు. చంద్రబాబుపై మహారాష్ట్ర ప్రభుత్వం కేసుపెడితే తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయాలని ఎందుకు అడగాలని ప్రశ్నించారు. చంద్రబాబు కుట్రలు ఆపకపోతే ఆయనను తరిమికొట్టే పరిస్థితి వస్తుందని బాల్కసుమన్ హెచ్చరించారు. చంద్రబాబును ఏపీ ప్రజలు ఓటేసి ఎన్నుకున్నారని వారికి సేవ చేయాలని సూచించారు. అక్కడి ప్రజల సొమ్ముతోనే ఏపీ పోలీసులకు జీతాలు వస్తున్నాయని, వారిని రక్షించడానికే పనిచేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment