పోలీసులు, కరెంట్ డిపార్ట్‌మెంట్‌దే తప్పు
డీజీపీ, సీఎస్, ఇంటెలిజెన్స్‌కు బాధ్యత లేదా?
గాజువాక సభలో చంద్రబాబు అహంకారపూరిత వ్యాఖ్యలు
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడింది తానేనంటూ అబద్ధాలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అనకాపల్లి: ‘నీ మీద రాయి వేస్తే కొంపలు కూలిపోయినట్లు మాట్లాడతావా? నేనే వేశానని అంటున్నారు. నేను గులకరాళ్లు వేయిస్తానా’ అంటూ విశాఖ జిల్లా గాజువాక, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఉద్దేశించి అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. ‘అసలు ఎవరిది తప్పు? పోలీసులు, కరెంట్ డిపార్ట్‌మెంట్‌దే తప్పు. పోలీసులకు, డీజీపీకి, ఇంటెలిజెన్స్‌కు, సీఎస్‌కు బాధ్యత లేదా’ అని అన్నారు. ‘కోడికత్తి డ్రామాలు వేశావు. గొడ్డలి వేటుతో బాబాయిని చంపేసి నామీద పెట్టాలని ప్రయత్నించావు.
ఇప్పుడు నీ చెల్లి అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నావు. ఇప్పడు విజయవాడలో డ్రామాలు వేస్తున్నారు’ అంటూ సీఎం జగన్‌పై దాడిని అవహేళన చేస్తూ మాట్లాడారు. సీఎం జగన్‌పై హత్యాయత్నాన్ని అవహేళనగా మాట్లాడటంపై ప్రజలు బాబు తీరుని అసహ్యించుకున్నారు. జగన్ రూ.13 లక్షల కోట్లు అప్పు చేసి బటన్ నొక్కినా ఎవరి జీవితాలూ మారలేదని చంద్రబాబు అన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడింది తానేనంటూ బాబు అబద్ధాలు చెప్పేశారు. వలంటీర్లతో నేరాలు, ఘోరాలు చేయించారని అన్నారు. ఈసారి ఓటు కూటమికి వేయాలని, తాను మళ్లీ సీఎం అవుతానని బాబు అనడంతో జనసేన కార్యకర్తల్లో నైరాశ్యం అలముకుంది. పవన్ సినిమా రంగంలో ఎదురులేని వ్యక్తి అంటూ పరోక్షంగా రాజకీయాల్లో అనుభవం లేదని చెప్పడంతో జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
స్పందించని ప్రజలు
ఈ ప్రభుత్వాన్ని తరిమి కొడదామా అని బాబు అడిగినా ప్రజలు స్పందించలేదు. తనపైనా చాలాసార్లు రాళ్ల దాడి జరిగిందని, ఇప్పుడు చేసిన రాళ్ల దాడిపై చప్పట్లు కొట్టి నిరసన తెలపండని చంద్రబాబు అడిగినా.. ఒక్కరూ స్పందించకపోవడంతో టాపిక్ మార్చేశారు. బాబు బస్సుపైకి టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థితో పాటు జనసేన, బీజేపీ నుంచి ఒక్కొక్కర్ని మాత్రమే అనుమతించారు. వారిని కూడా సెక్యూరిటీ వెనుక నిలబెట్టారు. మిగిలిన వారెవ్వరికీ ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో బీజేపీ, జనసేన నేతల్లో అసహనం వ్యక్తమైంది. జిల్లాలో మూడు చోట్ల జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నా.. వారిని గెలిపించమని చెప్పకపోవడంపై ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. టీడీపీ నేతలు ఎంతగా ప్రయత్నించినా రెండు సభలకు జనం అంతంతమాత్రంగానే వచ్చారు. ఈ సభలకు చంద్రబాబు రెండు గంటలు ఆలస్యంగా రావడంతో వచ్చిన కొద్దిమంది జనం, కార్యకర్తలు బాబు ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయారు.
శ్రేణుల ఎదుటే బండారును అవమానించిన బాబు
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తిని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కార్యకర్తల ఎదుటే తీవ్రంగా అవమానించారు. పెందుర్తి టికెట్ ఆశించిన బండారు.. ఆ స్థానాన్ని జనసేనకు కట్టబెట్టడంతో మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం చంద్రబాబుని కలిశారు. టికెట్ ఇవ్వకుండా అవమానించడం సరికాదని చంద్రబాబుతో అనడంతో.. ఒక్కసారిగా బాబు రెచ్చిపోయారు. ‘ఏం తమాషాలు చేస్తున్నావా? టికెట్ లేదని చెప్పిన తర్వాత కూడా వేషాలేస్తున్నావ్. మర్యాదగా చెప్పినట్లు నడుచుకో.
జనసేనకు సహకరించు’ అంటూ దాదాపు పది నిమిషాలు బండారుపై చిందులేశారు. ఇంత అవమానించి.. చివరకు బండారుని బుజ్జగించే ప్రయత్నం చేయగా.. చంద్రబాబుకి నమస్కారం చెప్పి నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. తీవ్ర మనస్తాపానికి గురైన బండారు సత్యనారాయణమూర్తి.. కార్యకర్తలు, అనుచరులతో కూడా మాట్లాడలేదు. మాడుగుల టికెట్ అయినా ఇవ్వాలని బండారు కోరారని, అందుకు ఒప్పుకోని చంద్రబాబు.. సీనియర్ నేతకు కనీస మర్యాద ఇవ్వకుండా ఘోరంగా అవమానించారంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
గులకరాయికే ఇంత ఇదా?: పవన్ కళ్యాణ్
తెనాలి: సీఎం జగన్‌కు గాయమైతే రాష్ట్రానికే గాయమైనట్లు అల్లరి చేస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ విమర్శించారు. ‘జగన్‌పై ఎవరో రాయి విసిరారట. అదేమిటోగానీ ఎన్నికలు అనేసరికి ఏదొకటి జరుగుతుంది. గాయాలవటమో... చంపేయటమో... చంపటమో జరుగుతోంది. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏమైంది? ఇంటెలిజెన్స్, పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు? గత ఎన్నికల్లో విశాఖలో కోడికత్తితో గాయం చేశారు.. వైఎస్ వివేకాను ఏ కత్తితో పొడిచారో తెలియదు...’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం రాత్రి బహిరంగ సభలో వారాహి నుంచి పవన్ మాట్లాడుతూ.. 15 ఏళ్ల అమర్నాథ్‌ను చెరుకుతోటలో పెట్రోలు పోసి అడ్డంగా తగలేస్తే రాష్ట్రానికి గాయం కాలేదా? 35 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే రాష్ట్రానికి గాయం కాలేదా? గతంలో చంద్రబాబుపై రాళ్ల వర్షం కురిపించినప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా? మీకు గులకరాయి తగిలితేనే ఇంత ఇదా! అంటూ విమర్శలు చేశారు. సానుభూతి తెలియజేస్తూ స్టేట్‌మెంట్ ఇవ్వాలని పార్టీ నాయకులు తనకు సూచించారన్నారు.
అయితే ఏం జరిగిందో తెలియకుండా ఎలా ఇస్తానని ప్రశ్నించానన్నారు. ‘ఏమో...అతనే కొట్టేసుకున్నాడేమో? ఎవరికి తెలుసు? కరెంటు కూడా పోయిందట! నాన్న–పులి కథలా ఒకసారి జరిగితే అనుకోవచ్చు. ప్రతిసారీ జరుగుతుంటే అబద్ధమంటున్నాం. సెంటిమెంటల్ డ్రామాలు ఆపండి... నాటకాలు భరించలేకున్నా. అందరిపైనా దాడిచేసే వ్యక్తిపై ఎవరైనా దాడిచేస్తారా? అయినా దాడిచేస్తే ఎంతసేపు పట్టుకోవటానికి?’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment