
ఆ కుక్క కోసం ఇద్దరు కానిస్టేబుళ్లు!
తమ పెంపుడు కుక్క అదృశ్యమైందని ప్రముఖ పారిశ్రామికవేత్త కొప్పల లలిత్ ఆదిత్య బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లాబ్రిడార్ జాతికి చెందిన ఈ కుక్కకు టింబర్ అనే పేరు పెట్టుకొని కుటుంబసభ్యులతో సమానంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నామని, ఈ నెల 14 సాయంత్రం నుంచి కనిపించడంలేదని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.
టింబర్ అదృశ్యమైనప్పటి నుంచీ తన ఇద్దరు పిల్లలూ కన్నీరుమున్నీరవుతూ అన్నం కూడా ముట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుక్క ఆచూకీ తెలిసిన వారు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లోని తన నివాసంలో లేదా.. 9849000715 నెంబర్‌లో కాని సంప్రదించాలని కోరారు. రూ. 50 వేల విలువ చేసే ఈ డాగ్ మిస్సింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు... దాని ఆచూకీ కనుగొనేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించారు.