ఒకడు బాత్రూమ్లో.. ఇంకొకడు ఫేస్బుక్లో
హైదరాబాద్: ఇద్దరు కీచకులు, ఒకడు బాత్ రూమ్ లో మాటువేసి స్నానం చేసేందుకు వచ్చిన యువతిని చెరపట్టేప్రయత్నం చేశాడు. ఇంకొకడు 'ఈ అమ్మాయి మంచిదికాదు' అంటూ ఫేస్ బుక్ లో ఫొటోలుపెట్టి అల్లరి చేశాడు. బాధితురాళ్ల ఫిర్యాదుల మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒకే రోజు రెండు నిర్భయ కేసులు నమోదయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలనుబట్టి..
ఫిలిం నగర్ లోని గౌతమ్ నగర్ కు చెందిన ఓ యువతి మంగళవారం ఉదయం స్నానం చేసేందుకు బాత్ రూమ్ లోకి వెళ్లింది. అప్పటికే బాత్ రూమ్ లోకి దూరి నీళ్ల డ్రమ్ములో దాక్కున్న యువకుడు, ఆమె లోనికి రాగానే అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో కేకలు వేస్తూ బయటికి పరుగు తీసిందా యువతి. తనపై జరిగిన అఘాయిత్యంపై కుటుంబసభ్యుల సహకారంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. నిందితుడు అదే ప్రాంతంలో కిరాణ షాప్ నడిపించుకునే ఎ.శ్రావణ్(22)గా గుర్తించిన పోలీసులు అతనిపై నిర్భయకేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. మరో సంఘటనలో
నల్లగొండ జిల్లా మోత్కూరు ప్రాంతానికి చెందిన యువతి(20) బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని షౌకత్‌నగర్‌లో తన సోదరుడి ఇంట్లో ఉంటూ సమీపంలోని ఓ ఆస్పత్రిలో పని చేస్తున్నది. షాద్‌నగర్‌కు చెందిన న్యారమోని శ్రీనివాస్(24) ఆ యువతికి పరిచయస్తుడు. ఆ చనువుతో ఆమె ఫొటో తీసిన యువకుడు.. ఫేస్‌బుక్‌లో ఫొటో పెట్టి 'ఈమె క్యారెక్టర్ మంచిదికాదు' అని రాశాడు. అంతేకాకుండా తాను చేసిన ఘనకార్యాన్ని ఫోన్ చేసిమరీ యువతికి తెలిపాడు. బుధవారం బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధిత యువతి శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుచేసింది. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.