
ఇద్దరు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
► కెమెరాలకు అడ్డుగా ఉన్నారని సస్పెన్షన్
► వెంటనే సభ శుక్రవారానికి వాయిదా
కెమెరాలకు అడ్డుగా ఉన్నారన్న కారణంతో ఇద్దరు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలపై రెండు రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. శివప్రసాదరెడ్డి, దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా)లను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
అంతకుముందు యనమల రామకృష్ణుడు కలగజేసుకుని, ప్రతిపక్ష నాయకులకు ఉన్నది కమ్యూనికేషన్ సమస్య కాదని, అండర్‌స్టాండింగ్ ప్రాబ్లమ్ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చర్చ ప్రారంభించమన్నప్పుడు కూడా ప్రతిపక్ష సభ్యులు చర్చకు అంగీకరించడం లేదన్నారు. సభ్యులను కావాలని రెచ్చగొట్టి వెల్‌లోకి పంపించడం దౌర్భాగ్యస్థితి అని విమర్శించారు. కెమెరాలకు అడ్డు పడుతున్నవాళ్లపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.
దాంతో సభ్యులపై చర్య తీసుకోడానికి తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడికి స్పీకర్ సూచించారు.
శాసనసభలో జరిగే ప్రతి విషయం కెమెరాల ద్వారా ప్రజలకు అందాలని, దానికి సభ్యులు అడ్డుపడుతున్నారని యనమల అన్నారు. కెమెరాలకు, సభకు అడ్డుపడటం సంప్రదాయాలకు వ్యతిరేకమని, కెమెరాలకు అడ్డుపడుతున్న ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నట్లు చెప్పారు. శివప్రసాదరెడ్డి, దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా)లను సస్పెండ్ చేయాలని కోరుతున్నానన్నారు. దీంతో స్పీకర్ వారిద్దరినీ రెండు రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు ప్రకటించి, వారిద్దరూ సభను వదిలి వెళ్లిపోవాలని సూచించారు.