అక్రమాలు జరిగిన గ్రూప్-2ను రద్దు చేయకపోతే మహా ఉద్యమం తప్పదని నిరుద్యోగ జేఏసీ హెచ్చరించింది
హైదరాబాద్: గ్రూప్-2 పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగినందున ఆ పరీక్షలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగులు చేపట్టిన మహా శిరోముండనం(గుండు గీయించుకునే)నిరసన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు.
నిరుద్యోగ జెఏసి చైర్మన్ కోటూరి మానవతారాయ్, నిరుద్యోగ జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు భీమ్‌రావ్ నాయక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని ఓయూ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని మానవతారాయ్ అన్నారు. కోర్టు స్టే ఇచ్చినా, అక్రమాలు జరిగాయన్న ఆధారాలున్నా సీఎం కేసీఆర్ పరీక్షలను రద్దుచేయకపోవడం సిగ్గుచేటన్నారు.
నిర్వహించిన ప్రతి పోటీ పరీక్షలో అక్రమాలు చూస్తుంటే మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపం కుంభకోణం తెలగాణలో పునరావృతం అయిందని, ఇది పెద్దల అవినీతికి నిదర్శనమని విమర్శించారు. హైకోర్టు గ్రూప్-2ను రద్దు చేసేలోపు ప్రభుత్వమే రద్దు చేసి తిరిగి మూడు నెలల్లో పరీక్ష నిర్వహించి ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే మహా ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.