ఘనంగా దత్తన్న అలయ్-బలయ్
• ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి వెంకయ్య
• వేడుకలో పాల్గొన్న గవర్నర్, రాష్ట్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు
• హాజరుకాని ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: గత కొన్నేళ్లుగా దసరా పండగ మర్నాడు కేంద్ర మంత్రి దత్తాత్రేయ సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న ‘అలయ్-బలయ్’ కార్యక్రమం ఈ ఏడాదీ ఘనంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, కళలు, సాంస్కృతిక రూపాలు, వివిధ రాజకీయ పార్టీలు, వర్గాల ప్రజల మేలుకలయికగా సాగింది. బుధవారం ఇక్కడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు తదితరులు అలయ్ బలయ్‌కి హాజరయ్యారు.
అయితే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఈ వేడుకకు హాజరు కాలేదు. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా పరస్పర మిత్రత్వం, సుహృద్భావం, అనురాగానికి ప్రతీకగా ఆలింగనం చేసుకుని (అలయ్-బలయ్) తమ స్నేహ, సౌభ్రాతృత్వాలను చాటారు. ఉడీ ఉగ్ర దాడిలో మరణించిన 19 మంది జవాన్లకు నివాళిగా కార్యక్రమంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో వివిధ పార్టీలు, సంఘాలు, అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో దత్తన్న అలయ్-బలయ్ ఉపయోగపడిందని, ఈ కార్యక్రమాన్ని, దత్తాత్రేయను విడదీసి చూడలేమని శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ పేర్కొన్నారు.
హాజరైన ప్రముఖులు...
కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీలు డా.కె.కేశవరావు, డా.బూర నర్సయ్యగౌడ్, సి.మల్లారెడ్డి, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయొద్దీన్, టీడీపీ నేతలు ఎల్.రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి, ఆర్.కృష్ణయ్య, బీజేపీ ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, ఆ పార్టీ నేతలు మురళీధర్‌రావు, ఎన్. రామచంద్రరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, పేరాల చంద్రశేఖర్‌రావు, జంగారెడ్డి, బద్ధం బాల్‌రెడ్డి, కె.దిలీప్‌కుమార్, కొండ్రు పుష్పలీల, కర్ణాటక మాజీ ఎంపీ విరూపాక్ష, లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి, జస్టిస్ చంద్రకుమార్, విద్యావేత్త చుక్కా రామయ్య, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి, మంద కృష్ణమాదిగ, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, ప్రజా గాయకుడు అంద్శై చుక్కా సత్తయ్య, సినీనటులు శారద, ఆర్. నారాయణమూర్తి, వీసీలు రాజారత్నం, సునయనాసింగ్, మాజీ వీసీ ప్రొ. ఎన్.గోపి, బీఎస్ రాములు, కాళప్ప, ఏపీ ఉద్యోగ సంఘాల నాయకుడు కృష్ణయ్య తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
పరిశ్రమల పునరుద్ధరణకు సహకారం: దత్తాత్రేయ
రాష్ర్టంలో మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణకు తన వంతు సహకరిస్తానని కేంద్ర మంత్రి దత్తాత్రేయ చెప్పారు.360 వరకు ఫ్యాక్టరీల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కేంద్రం కూడా సహకారం అందించే అవకాశం ఉందన్నారు. బంగారు తెలంగాణ ద్వారా సమ్మిళిత అభివృద్ధికి, అట్టడుగున ఉన్న దళిత బలహీన, ఓబీసీ, మైనారిటీలకు విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటామన్నారు.
పలువురికి సన్మానం
వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభను చూపిన పద్మజారెడ్డి, అలేఖ్య పుంజల, కరుణాగోపాల్, రమ్య, జాహ్నవి, హలీంఖాన్, వీసీ రాజారత్నం, మాధవి, బెల్లం మాధవి, బుచ్చిరెడ్డి, అంతర్ముఖుల రమాదేవి తదితరులను ఈ సందర్భంగా జ్ఞాపిక, శాలువాలతో దత్తాత్రేయ సన్మానించారు.
విభిన్న సంస్కృతుల సమాహారమే భారత్: వెంకయ్య
వివిధ సంస్కృతుల సమాహారమే భారత, హిందూ సంస్కృతి సంప్రదాయాలని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ‘నీది, నీవు తింటే ప్రకృతి. ఎదుటివాడిది లాక్కుని తింటే వికృతి. పక్కనున్న వాడికే పెడితే సంస్కృతి’ అని చెప్పారు. అలయ్ బలయ్ అంటే అందరూ సుఖ, సంతోషాలతో ఉండటమేనంటూ జై తెలంగాణ, జైహింద్ అని ప్రసంగాన్ని ముగించారు. అలయ్-బలయ్ అంటే కలసిమెలసి, ప్రేమతో మెలగాలని, దాతృత్వ భావనతో ఉండాలని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు.
39 రకాల వంటకాలు
అలయ్-బలయ్‌లో 39 రకాల వంటకాలను వడ్డించారు. బగార అన్నం, వైట్‌రైస్‌తోపాటు మాంసాహారంలో లివర్, మటన్ ఫ్రై, మటన్ పులుసు, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, నాటుకోడి పులుసు, నాటుకోడి ఫ్రై, రొయ్యలు, వట్టి చేపలు, బొమ్మిడాల పులుసు, శాకాహార విభాగంలో టమాటా కర్రీ, ఆలు ఫ్రై, పచ్చి పులుసు, జొన్న, సజ్జ రొట్టెలు, అంబలి, సకినాలు, గారెలు, మొక్కజొన్న గారెలు, సర్వపిండి, బచ్చాలు, అటుకులు, లడ్డూలు, మొరమొరాలు, చుడువ లాంటి ఎన్నో రకాల వంటకాలు విందులో ఏర్పాటు చేశారు.