గాంధీ ఆస్పత్రి: సుమారు ఐదు దశాబ్దాల క్రితం వారంతా వైద్య విద్యార్థులు. వైద్యవిద్య పూర్తయిన తర్వాత వృత్తిరీత్యా దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. ఇన్నాళ్లకు మళ్లీ కలుసుకున్నారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. సికింద్రాబాద్ గాంధీ వైద్య కళాశాల ప్రాంగణంలోని అలుమ్నీ భవనంలో బుధవారం 62 వసంతాల వేడుకల్లో వీరంతా కలిశారు. ఆప్యాయ పలకరింపులు... ఆత్మీయ ఆలింగనాలతో సందడి చేశారు. ర్యాంకులు సాధించేందుకు కష్టపడి చదివిన రాత్రులు... సరదాగా చూసిన సినిమాలు... అల్లరి పనులున్ చిలిపి చేష్టలను గుర్తు చేసుకొని... జోకులు వేసుకుంటూ ఒకరినొకరు ఆట పట్టించుకున్నారు. సెల్ఫీలు, ఫోటోలు దిగి జ్ఞాపకాలను పదిలపరుచుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీఎంఈ డాక్టర్ రమణి అలుమ్నీ భవనంలోని మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ మెడికల్ కాలేజీ అలుమ్నీ అసోసియేషన్ ద్వారా అనేక సామాజిక సేవ, వైద్య, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, డాక్టర్ జి.లింగమూర్తి తెలిపారు.