
పీఆర్సీ బకాయిలకు 9 నెలలా?: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు కోసం జీతాలను, జీవితాలను త్యాగం చేసి పోరాడిన ఉద్యోగులకు 9 నెలలుగా పీఆర్సీ బకాయిలను ఎందుకివ్వడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఘనంగా ప్రకటించిన 43 శాతం ఫిట్‌మెంట్ ఏమైందన్నారు. రాష్ట్రం ఏర్పాటై 21 నెలలు దాటుతున్నా ఉద్యోగ విభజన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్‌కార్డులను జారీ చేసినా అవి ఏ ఆసుపత్రిలోనూ పనిచేయడం లేదన్నారు. ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, పీఆర్‌సీ బకాయిలు, ఉద్యోగుల విభజన వంటి డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులంతా సిద్ధం కావాలన్నారు. ఉద్యోగుల పక్షాన పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు.