
రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవడంలో విఫలం
భాగ్యనగర్‌కాలనీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి గా విఫలమయ్యాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, సీనియర్ నాయకుడు వి.హనుమంతరావులు ఆరోపించా రు. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం వారు మీడియా తో మాట్లాడుతూ.. తమ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విద్యార్థులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారని, ఆయనకు మద్దతుగా తాము హెచ్‌సీయూ ప్రధాన ద్వారం ముందు శనివారం ధర్నా చేస్తుంటే పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసి కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారని అన్నారు.
విద్యార్థులకు మద్దతు తెలి పేందుకు తమ నాయకుడు రాహుల్‌గాంధీ వస్తే ఆయనను అడ్డుకునేందుకు ఏబీవీపీ విద్యార్థులు కుట్రపన్నారన్నారు. దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే అతని కుటుంబానికి అన్ని విధాలా ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఇప్పటి వరకు వీసీ అప్పారావును సస్పెండ్ చేయలేదని, ఈ ఘటనకు కారణమైన కేంద్రమంత్రి స్మృతి ఇరానీని పదవి నుంచి తొలగించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దళితుల పట్ల ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సీబీఐతో విచారణ జరిపించాలి: ఎస్‌ఎఫ్‌ఐ
కేపీహెచ్‌బీకాలనీ: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మృతి పై సీబీఐ విచారణ జరిపించి, నిందితులను వెంటనే శిక్షించాలని కోరుతూ జేఎన్టీయూహెచ్ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. రోహిత్ జయంతి సందర్భంగా అతని చిత్రపటానికి ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు నరేష్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి, కొవ్వొత్తులతో నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నరసింహ, నరేష్, సమీర్, రాజు, శశాంక్, వినోద్, గోవర్దన్, శ్రీనునాయక్, రఘు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు అండగా ఉంటాం...
హిందూ మతోన్మాద వ్యతిరేక వేదిక
దోమలగూడ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల డిమాండ్లు నేరవేరేవరకు వారికి హిందూ మతోన్మాద వ్యతిరేక వేదిక అండగా ఉంటుందని పలువురు వక్తలు ప్రకటించారు. రోహిత్ వేముల మృతికి కారణమైన వారిని శిక్షించే వరకు పోరాడుదాం అంటూ హిందూ మతోన్మాద వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో ఇం దిరాపార్కు వద్ద వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విరసం నాయకులు వరవరరావు మాట్లాడుతూ.. దేశంలో దళి తులు, ఆదివాసీలు, ముస్లింలు, మహిళలపై భౌతిక, సాంస్కృతిక దాడులు తీవ్రమయ్యాయన్నారు. ఉన్నత విద్యను బోధించే విశ్వవిద్యాలయాలు అగ్రహారాలుగా మారాయని ఆరోపించారు. యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ చనిపోయేముందు వీసీకి రాసిన సూసైడ్ నోట్ చాలా విలువైందన్నారు.
రోహిత్ పిరికితనంతో ఆత్మహత్య చేసుకోలేదని, ఆయనది త్యాగం అని అన్నారు. కులమతాలు ఏవైనప్పటికీ డబ్బున్న వాళ్లు బ్రహ్మణిజం లోకి మారుతున్నరన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రే య లేఖ ఆధారంగా విద్యార్థులను సస్పెండ్ చేయడం శోచనీయమన్నారు. రోమిత్ మృతికి కారకులైనమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయ, వీసీ అప్పారావు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావులపై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వేదిక కన్వీనర్ అభినవ్, వహాద్ ఎ ఇస్లామీహిందూ నాయకులు మౌలానా నసీరుద్దీన్,ప్రొఫెసర్ రత్నం, పీడీఎస్‌యూ నాయకులు రాజు, గంగాధర్, పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య, ఫాతిమా ప్రసంగించారు.