సీఎం కేసీఆర్ మద్దతుతోనే హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో విద్యార్థులపై దాడులు జరిగాయని నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. దేశంతోపాటు రాష్ట్రంలో ప్రశ్నించే వారిని అణగదొక్కుతున్నారని విమర్శించారు. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మరణం వెనుక వీసీ అప్పారావు హస్తంపై విచారణ జరుగుతున్న తరుణంలో వీసీని విధుల్లోకి తీసుకోవడం వెనుకా కేసీఆర్ హస్తం ఉందన్నారు. దళిత విద్యార్థి మరణిస్తే కనీసం సీఎం పరామర్శించలేదని గుర్తు చేశారు.
శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో గతంలో ఇరిగేషన్ శాఖ అవినీతిలో కూరుకుపోయిందని చెప్పిన కేసీఆర్ ప్రస్తుతం అదే కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టబెడుతున్నారని ఆరోపించారు. టీజేఏసీని నిర్వీర్యం చేయడం వెనుక కేసీఆర్ హస్తం ఉందన్నారు.
కరువు మండలాల ప్రకటనలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే వారిపై ప్రతిదాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా రైతులకు రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం మభ్యపెడుతోందన్నారు. కేసీఆర్ ఒక్కరే సీడీఎఫ్ రూ.5 వేల కోట్లు దగ్గర పెట్టుకుని కొడుకు, అల్లుడికే నిధులిస్తూ బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చే రాయితీలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.