హైదరాబాద్ : రాష్ట్రంలో కృష్ణా పుష్కరాల పనులు నాసిరకంగా జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీహెచ్ ఆరోపించారు. దీనిపై గవర్నర్ స్పందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. గుళ్లు గోపురాలు తిరగడానికి తప్ప ఆయనకు వేరే పనిలేదని ఎద్దేవా చేశారు. భవానీ ఘాట్ వద్ద నిర్మించిన బ్రిడ్జి నాసిరకంగా ఉందని... పిల్లర్ పడిపోయినా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగుతోన్న పుష్కర పనులపై గవర్నర్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. పుష్కర పనులు కాంట్రాక్ట్ తీసుకున్న సోమా కంపెనీ ఎవరిదో బయటకు రావాలని వీహెచ్ అన్నారు.గవర్నర్కు ఇచ్చే వినతి పత్రాలన్నీ చెత్త బుట్టలోకి చేరుతున్నాయని వీహెచ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గవర్నర్ ఉన్నంత వరకు న్యాయం జరగదన్నారు.
ఛలో మల్లన్న సాగర్కు తనను పిలవలేదని కాంగ్రెస్ నాయకులపై వీహెచ్ మండిపడ్డారు. నేను మల్లన్నసాగర్కు వెళ్తే.. ఎవరిని అడిగి వచ్చారని సునీతాలక్ష్మారెడ్డి అనడం దారుణమని వీహెచ్ వ్యాఖ్యానించారు. స్థానిక నాయకులను ఆమె బెదిరించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. జిల్లాకు చెందిన నాయకులే నన్ను వద్దని అన్నప్పుడు నేను ఎందుకు వెళ్లాలని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.