
అన్ని పోలీస్ స్టేషన్లలో వీసీ వ్యవస్థ
పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లో ఏర్పాటు
పోలీసు విభాగం ఛీఫ్ అనురాగ్ శర్మ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని పోలీసుస్టేషన్లనూ వీడియో కాన్ఫరెన్సింగ్ (వీసీ) సౌకర్యం ద్వారా అనుసంధానించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. ఇందులో భాగంగానే పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో వీసీ వ్యవస్థను డీజీపీ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తీసుకున్న ఈ చర్య ఎంతో ఉపయుక్తమైంది.
హైదరాబాద్ మాదిరిగానే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా ఎస్పీ కార్యాలయాలు, డీఎస్పీలు పర్యవేక్షించే సబ్-డివిజన్, సర్కిల్ ఆఫీస్‌లతో పాటు పోలీసుస్టేషన్లనూ వీసీ ద్వారా అనుసంధానించాలని నిర్ణయించాం. సిటీలో ఏర్పాటైన పెలైట్ ప్రాజెక్టు ద్వారా ఇందులో ఉన్న లోపాలు, ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధ్యయనం చేసి అధిగమిస్తాం. ఆపై విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తాం. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) పర్యవేక్షణలో పని చేసే ఈ విధానం పూర్తి సాఫ్ట్‌వేర్ ఆధారంగా పని చేస్తుంది. ఎంతో ఉపయుక్తమైన ఈ సౌకర్యాన్ని నగర పోలీసులు సద్వినియోగం చేసుకుని, పోలీసు ప్రతిష్టను మరింత పెంచాలి’ అని అన్నారు.
‘వీసీ’తో కొత్వాలే హోంగార్డుతో సంప్రదింపులు చేయొచ్చు
నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘కమిషనరేట్‌లోని శాంతిభద్రతల విభాగం, ట్రాఫిక్ పోలీసుస్టేషన్లతో పాటు డీసీపీ, ఏసీపీ కార్యాలయాలు, ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి అధికారులు సహా మొత్తం 150 మంది వీసీని వినియోగించుకునే అవకాశం ఇచ్చాం. ప్రతి అధికారీ తమ సౌలభ్యానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు గ్రూప్స్ ఏర్పాటు చేసుకుని, వాటి ఆధారంగా సమాచార మార్పిడి చేసుకోవచ్చు. వీసీ విధానం ద్వారా నేరుగా కొత్వాలే క్షేత్రస్థాయిలో ఉండే హోంగార్డుతోనూ సంప్రదింపులు జరిగే అవకాశం ఏర్పడింది.
కేవలం కమిషనరేట్ పరిధిలో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఎన్‌ఐసీ ఆధీనంలో పని చేసే ప్రతి పోలీసుతోనూ అధికారులు వీసీ ద్వారా సంప్రదింపులు జరిపి, సమాచార మార్పిడి చేసుకునే అవకాశం ఉంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీలు అంజనీకుమార్, వై.నాగిరెడ్డి, స్వాతి లక్రా, సంయుక్త పోలీసు కమిషనర్ మురళీకృష్ణ, ఎస్పీ రమేశ్‌రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.