రోహిత్ దళితుడు కాదు: టీ.పోలీసుల నివేదిక
న్యూఢిల్లీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ స్కాలర్ వేముల రోహిత్ అంశంపై సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. రోహిత్ దళితుడు కాదంటూ తెలంగాణ పోలీసులు నివేదిక ఇచ్చారు. రోహిత్ దళితుడు కాదన్న తహశీల్దార్ నివేదికను పోలీసులు పేర్కొన్నారు. ఇదే రిపోర్టులోని అంశాలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో శుక్రవారం ప్రస్తావించారు.
మరోవైపు రాజ్యసభలోనూ వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనపై దుమారం రేగింది. స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై సీపీఎం జాతీయ కార్యదర్శి, ఎంపీ సీతారాం ఏచూరీ అభ్యంతరం తెలిపారు. కేంద్రం తీరు వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆరోపించారు. ఇక రోహిత్ మృతిపై వేసిన విచారణ కమిటీలో దళితులు లేరని బిఎస్పీ నేత మాయావతి వ్యాఖ్యానించారు. కమిటీలో దళితులను ఎందుకు నియమించలేదని ఆమె ప్రశ్నించారు.