నగరంలో పటిష్టమైన నిఘా కెమెరాలు
► ఒక్కోటి 7 చదరపు కిమీ పరిధిలో నిఘాకు అనువు
► 12 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కొత్వాల్ నిర్ణయం
► ప్రధాని రాక నేపథ్యంలో ప్రయోగాత్మకంగా 3 ఏర్పాటు
హైదరాబాద్: దాదాపు వంద మంది పోలీసుల కాసే కాపలాను ఒక్క కెమెరా కాస్తుంది. తన చుట్టూ ఏడు చదరపు కిమీ పరిధిలో ఏకకాలంలో కన్నేసి ఉంచుతుంది... రెండు చదరపు కిలోమీటర్లలో ఉన్న వ్యక్తి ముఖాన్ని సైతం స్పష్టంగా చూపిస్తుంది... ఇలాంటి శక్తిమంతమైన పీటీజెడ్ కెమెరాలను నగర పోలీసు విభాగం సమీకరించుకుంటోంది. ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరుగనున్న ప్రధాని నరేంద్ర మోడీ సభ నేపథ్యంలో మూడింటిని తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు.
రియల్ టైమ్ సమాచారం సేకరణకు...
అత్యంత ప్రముఖుల పర్యటనలు, గణేష్ నిమజ్జన ఊరేగింపు, భారీ స్థాయిలో జరిగే సభలు, సమావేశాల సందర్భంలో బందోబస్తు, భద్రతా విధులు పోలీసులకు పెద్ద సవాల్ లాంటిదే. ఆయా ప్రాంతాలతో పాటు నగర వ్యాప్తంగానూ ఏం జరుగుతోందో ఎప్పకప్పుడు తెలుసుకుంటేనే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సిటీలో కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో, ఏకకాలంలో నిఘా ఉంచడానికి ఉపకరించవు. ఈ నేపథ్యంలో కీలక ఘట్టాల్లో ఎప్పటికప్పుడు (రియల్ టైమ్) సమాచారం సేకరించడానికి అత్యంత శక్తిమంతమైన వీడియో కెమెరాలను వినియోగించాలని నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి నిర్ణయించారు.
12 ప్రాంతాల్లో ఏర్పాటుకు నిర్ణయం...
మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ తరహా కెమెరాల్లో ఆక్టోవిజన్ కంపెనీకి చెందిన ‘30 ఎక్స్ పీటీజెడ్ డోమ్’ కెమెరాలు సిటీలో వినియోగించడానికి అన్ని కోణాల్లోనూ ఉపయుక్తమని నిర్ణయించారు. వైర్‌లెస్ పరిజ్ఞానంతో పని చేసే ఈ కెమెరాలు గరిష్టంగా ఏడు చదరపు కిమీ పరిధిలో కన్నేసి ఉంచడానికి ఉపకరిస్తాయి. ఇలాంటి కెమెరాలు 12 ఖరీదు చేయడంతో పాటు నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఎత్తైనన భవనాలను ఎంపిక చేసుకుని, వాటిపై వీటిని బిగిస్తారు. 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ అక్కడి దశ్యాలను చూపించడం వీటి ప్రత్యేకత. ఈ కెమెరాలను వైర్‌లెస్ పరిజ్ఞానంతోనే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో (సీసీసీ) అనుసంధానిస్తారు. అక్కడ ఉన్న సిబ్బంది, అధికారులు ఈ పరిధిలో ఏం జరుగుతోందనేది తెరపై చూస్తూ తెలుసుకునే అవకాశం ఉంది.
ప్రయోగాత్మంకగా మూడు ఏర్పాటు...
ఈ కెమెరాల పనితీరును అధ్యయనం చేయడానికి ప్రయోగాత్మకంగా మూడింటిని ఖరీదు చేశారు. ఆదివారం ఎల్బీ స్టేడియంలో జరుగనున్న ప్రధాని మోడీ సభ నేపథ్యంలో వినియోగిస్తున్నారు. స్టేడియం చుట్టూ ఉన్న బాబూఖాన్ ఎస్టేట్, కేఎల్‌కే ఎస్టేట్, డెక్కన్ టవర్స్‌పై వీటిని ఏర్పాటు చేశారు. పవర్‌కట్ వంటి సమస్యలు రాకుండా జనరేటర్ సౌకర్యం ఉన్న లిఫ్ట్ రూమ్స్ నుంచి పవర్ సప్లై తీసుకున్నారు. బాబూఖాన్ ఎస్టేట్ పైన ఉన్న కెమెరాతో అటు చార్మినార్, ఇటు బోయిన్‌పల్లి ప్రాంతాలు సైతం స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు మిగిలిన రెండింటితోనూ ఎల్టీ స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు స్టేడియం లోపలా, వేదికనూ స్పష్టంగా చూసే అవకాశం ఏర్పడింది. ఎల్టీ స్టేడియం, చుట్టూ ఉన్న మార్గాలు, పార్కింగ్.. ఇలా ప్రతి ప్రదేశంలోని అణువణువూ స్పష్టంగా కనిపిస్తోంది.
వీటిలోని అత్యాధునిక అంశాలు ఎన్నో...
ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ కెమెరాలను ఎలాంటి వైర్లు లేకుండానే సీసీసీతో అనుసంధానించవచ్చు. బహిరంగ, ఎత్తైన ప్రదేశాల్లో ఉండే కెమెరాల నిర్వహణ పెద్ద సవాల్ లాంటిది. నిత్యం దుమ్ముధూళితో పాటు వర్షం కురిసినప్పుడు వాననీటి చుక్కలు కెమెరా గ్లాస్‌పై పడి ఇబ్బందులు కలిగిస్తాయి. అలాగని ప్రతిసారీ వాటి వద్దకు వెళ్ళి శుభ్రం చేయడం కష్టసాధ్యం. ఈ నేపథ్యంలో ఈ కెమెరాలను వైబర్ సదుపాయం కూడా ఉంది. సీసీసీలోని సిబ్బంది ఓ కమాండ్ ఇవ్వడం ద్వారా కెమెరా గ్లాస్‌పై ఉండే వైబర్ శుభ్రం చేస్తుంది. సిబ్బందితో పని లేకుండా ఉండేలా సెన్సర్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. గణేష్ నిమజ్జనం నాటికి 12 కెమెరాలను వినియోగంలోకి తీసుకురావడానికి నగర పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది.